ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగించింది. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ఫిబ్రవరి 14 వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగియనుండటంతో దాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశంలో అయితే గరిష్ఠంగా 200 మంది, ఇన్ డోర్ అయితే 100 మందికి అనుమతి ఉంటుంది.
పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఏపీ మంత్రులు కూడా ఆ లిస్టులో ఉన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చకు పేర్ని నాని హాజరవ్వలేదు.