More

    ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్న ఉద్యోగ సంఘాలు

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. రాష్ట్ర జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఉద్యోగ సంఘాల నేతలు నోటీసును ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని సమ్మె నోటీసులో డిమాండ్ చేశారు. భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు విజయవాడలోని రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సమావేశమైయ్యారు. సీఎస్‌కు ఇవ్వదలచిన సమ్మె నోటీసులు, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్ వచ్చింది. సమస్యను మరింత పెద్దదిగా చేయొద్దని, సమ్మె నోటీసులు ఇవ్వొద్దని కోరారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వంతో చర్చలకు రావాలని మంత్రులు ఆహ్వానించారు. వారి ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల నేతలు తిరస్కరించారు. పీఆర్సీ జీవోను రద్దు చేస్తేనే ప్రభుత్వంతో సంప్రదింపులకు వస్తామని మంత్రులకు వారు తేల్చిచెప్పారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకునేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

    పీఆర్సీపై చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఇప్ప‌టికే మంత్రులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చర్చలకు రావాలని పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదని చెప్పారు. వారు వస్తే అన్ని విషయాలను వివరిస్తామని అన్నారు. మంగళవారం కూడా వారి కోసం ఎదురు చూస్తామని, చర్చలకు రావాలనే సమాచారాన్ని పంపిస్తామని అన్నారు. ఉద్యోగులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. పీఆర్సీపై ఏవైనా సందేహాలు ఉంటే ఉద్యోగులు కమిటీని అడగొచ్చని ఆయన చెప్పారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అని సజ్జల స్పష్టం చేశారు. చర్చలు, కమిటీపై అపోహలు వీడాలని అన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగానే కమిటీ ఏర్పాటైందని.. చర్చలకు వస్తేనే మిగతా అంశాల గురించి మాట్లాడగలమన్నారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదని చెప్పారని.. రేపు కూడా వారితో చర్చలకు వేచి చూస్తామని, మరోసారి ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందిస్తామన్నారు. ట్రెజరీ ఉద్యోగుల చర్యలతో నోటీస్‌ పీరియడ్‌కు అర్థం ఉండదని.. అలా చేస్తే క్రమశిక్షణలో ఉంచే ప్రక్రియ ప్రారంభమవుతుందని సజ్జల హెచ్చరించారు. సమ్మె విషయంలో ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు సజ్జల. సమ్మె నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులను కొన్ని వర్గాలు వాడుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి ఉద్యోగులపై ఎలాంటి ద్వేషం లేదని సజ్జల అన్నారు. ఎక్కడో ఉండి ప్రకటనలు ఇవ్వడం కంటే, తమ దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకుంటే సమంజసంగా ఉంటుందని హితవు పలికారు. పీఆర్సీ చాలదని ఉద్యోగులు అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతమేరకు మంచి చేశామో తాము చెబుతున్నామన్నారు.

    Trending Stories

    Related Stories