సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం కీలక మార్పు చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. సోమవారం రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జీవో ఇచ్చినా ఆ తర్వాత మార్పులు చేసింది. సంక్రాంతి తర్వాతే రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది.ఈ మేరకు తొలుత జారీ చేసిన ఉత్తర్వులను సవరించి తాజాగా జీవో జారీ చేసింది. సంక్రాంతి తరువాత అంటే జనవరి 18 నుంచి 31 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఊళ్లకు వస్తుండడంతో కర్ఫ్యూ అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం బావించింది. ఈ మేరకు తొలుత ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులకు ఇచ్చారు. విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ లో 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించనున్నారు. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది.