ఆంధ్రప్రదేశ్ కు ఏయే బ్యాంకుల్లో ఎన్ని అప్పులు ఉన్నాయో.. రాజ్య సభలో క్లారిటీ ఇచ్చారు

0
905

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏయే బ్యాంకుల్లో ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియాలనే విషయమై కూడా వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పది జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్ల అప్పు తీసుకుందని భగవత్‌ కరాడ్‌ చెప్పుకొచ్చారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేవ్‌లో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. 2019 నుంచి 2021 వరకు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు వివరించారు.

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్ల రుణం, బ్యాంక్‌ ఆఫ్‌ భరోడా నుంచి 5 కంపెనీలు, కార్పొరేషన్లు రూ.10,865 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7 వేల కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్ల రుణం, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు నుంచి రూ.750 కోట్లు రుణం, ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.5,500 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు రుణం పొందినట్లు కేంద్రమంత్రి సభలో స్పష్టం చేశారు.