Telugu States

సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో వేసేస్తాం: ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ లో అమ్మడానికి ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 2న జీవో 69ని విడుదల చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు.. టికెట్ల విక్రయాల తర్వాత థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయాన్ని ఎంఓయూలో పేర్కొనకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫిలింఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయాలను జరుపుతామని ఎగ్జిబిటర్లు కోరారు.

అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సినిమా టికెట్ల కలెక్షన్లు ఒక్కరోజులోనే థియేటర్ల ఖాతాలో జమవుతాయని హామీ ఇస్తోంది. రోజువారి ప్రాతిపదికన టికెట్ల కలెక్షన్లు థియేటర్లకు చెల్లిస్తారని ఏపీ స్టేట్‌ ఫిల్మ్, టీవీ, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) సినిమా థియేటర్ల యజమానులతో కుదర్చుకునే అవగాహన ఒప్పందం (ఎంఓయూ)లో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ల కలెక్షన్‌ను రోజువారి ప్రాతిపదికన సంబంధిత థియేటర్ల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామని.. సినిమా టికెట్ల కలెక్షన్లలో సర్వీస్‌ చార్జి (1.95శాతం) మినహాయించుకుని మిగిలిన మొత్తం, జీఎస్టీతో సహా థియేటర్ల బ్యాంకు ఖాతాలో ఒక్క రోజులోనే జమవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. థియేటర్ల యాజమాన్యమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సినిమా టికెట్ల విక్రయ మొత్తం తమకు ఎప్పుడు చేరుతుంది అనేదానిపై థియేటర్ల యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరమేలేదని ప్రభుత్వం అంటోంది.

Related Articles

Back to top button