More

    ఆప్తుడిని కొల్పోయిన చంద్రబాబు.. మాజీ మంత్రి హఠాన్మరణం

    టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ ద్వారా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి కన్నుమూశారు.

    ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఆయన సేవలందించారు. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బొజ్జల అలిపిరి పేలుళ్ల సమయంలో చంద్రబాబుతో పాటు ఆయన కూడా గాయపడ్డారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేక విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఇక చంద్రబాబు హయాంలో ఆయన అటవీశాఖ మంత్రిగా పని చేశారు. ఆయనది చిత్తూరు జిల్లా ఉరందూరు స్వగ్రామం.

    లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడి అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. బొజ్జల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు చంద్రబాబు.

    బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరున్ని, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. అనారోగ్యం తో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన జ్జాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరులో 1949 ఏప్రిల్ 15న జన్మించారు. ఆయన తండ్రి గంగసుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేశారు.. గోపాలకృష్ణారెడ్డి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి 1968లో బీఎస్సీ పట్టా పొందారు.. 1972లో లా పట్టాను అందుకున్నారు. వివాహం అనంతరం లా ప్రాక్టీసు కోసం హైదరాబాద్ వచ్చారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

    బొజ్జల 1989, 94, 98, 2009, 2014లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994-2004 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. మళ్ళీ 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించగా.. చంద్రబాబు కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం గోపాలకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు.. ఆయన బదులు తన రాజకీయవారసుడిగా కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోకి దింపగా ఓటమి ఎదురైంది. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత నెల బొజ్జల పుట్టినరోజు నాడు చంద్రబాబు ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. బొజ్జలకు చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది.. ఇద్దరు ప్రాణస్నేహితులు.

    Trending Stories

    Related Stories