More

    వేమన విగ్రహాన్ని తొలగించలేదని చెబుతున్న ప్రభుత్వం

    కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో యోగి వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టారని వస్తున్న విమర్శలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అవన్నీ తప్పుడు కథనాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యోగి వేమన విగ్రహాన్ని ఎంతో గౌరవంగా తొలగించి.. అంత కంటే ఎక్కువ గౌరవంగా యూనివర్శిటీ గేటు వద్ద ప్రతిష్టించారని తెలిపింది. గతంలో యోగి వేమన విగ్రహం రోడ్డు మధ్యలో ఉండేదని.. ఇప్పుడు యూనివర్శిటీ గేటు మధ్యలో పెట్టారన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి కూడా దీనిపై వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో భాగంగా విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశామని, మెయిన్ గేట్ వద్ద వేమన విగ్రహం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. యూనివర్శిటీ వ్యవస్థాపకులు దివంగత రాజశేఖరరెడ్డి కావడంతో వేమన విగ్రహం స్థానంలో ఆయన విగ్రహాన్ని పెట్టామని తెలిపారు. తాము కొత్త విగ్రహాలను తీసుకురాలేదని, ఉన్న విగ్రహాలనే మరో చోటుకు మార్చడం జరిగిందని చెప్పారు.

    Trending Stories

    Related Stories