ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోశయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు.
1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. తర్వాత మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పటికీ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31 నుండి 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. వయసు మీద పడుతూ ఉండడంతో రాజకీయాల నుండి ఆయన దూరమవుతూ వచ్చారు. ఆయన మరణంపై పలువురు నేతలు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
తొలిసారిగా మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు, రహదారుల శాఖ, రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 1992లో కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య బాధ్యతలు నిర్వర్తించారు.