More

    డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిపై ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెబుతోంది ఇదే..!

    వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కారు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిపై ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి స్పందించారు. శుక్రవారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే కేసు న‌మోదు చేశామ‌ని అన్నారు. వైద్య నివేదిక‌లు అందాక పూర్తి స్థాయి ద‌ర్యాప్తును మొద‌లుపెడ‌తామ‌ని చెప్పారు కేసు ద‌ర్యాప్తును వీల‌యినంత త్వ‌ర‌గా ముగిస్తామ‌ని శ‌నివారం తిరుప‌తిలో మీడియాకు చెప్పుకొచ్చారు. మరో వైపు సుబ్రహ్మణ్యం శవపంచనామాకు సంతకాలు పెట్టడానికి కుటుంబ సభ్యులు ఆచూకీ లేకుండా పోయారు. మాకు న్యాయం చేసే వరకు సంతకాలు పెట్టమని అంటున్నారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. వారి బంధువుల్ని వాకబు చేస్తున్నారు పోలీసులు. పోస్ట్ మార్డం నిర్వహించాలంటే కుటుంబ సభ్యులు అనుమతి తప్పనిసరి. వారి సంతకాలు లేనిదే పోస్ట్ మార్డం నిర్వహించలేమని చెబుతున్నారు డాక్టర్లు.

    డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. రాత పూర్వకంగా చెప్తే అనుమానిత వ్యక్తులను విచారణ చేసి ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని పోలీసులు అంటున్నారు.

    కాకినాడ జీజీహెచ్ లో నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఘటన జరిగి దాదాపు 30 గంటలు గడిచిన ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్రహ్మణ్యం మృతికి ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు,ఎం.ఎస్ రాజు, పీతల సుజాత. పిల్లి మాణిక్యాలరావు వున్నారు. వైసీపీ అరాచక పాలనకు ఇదొక ఉదాహరణ అని ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు తీవ్ర విమర్శలు చేశారు.

    Trending Stories

    Related Stories