Telugu States

ప్రజలే జగన్‌పై దాడి చేసే రోజులు రాబోతున్నాయి: నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుని ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ కళ్యాణ్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీని విమ‌ర్శించే అర్హ‌త ప‌వ‌న్ కు లేద‌ని చెప్పారు. అయితే ప్రజలే జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసే రోజు రాబోతున్నది అంటూ నోరు జారారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయబోయి సీఎం జగన్‌ పైనే వ్యాఖ్యలు చేశారు. జగన్ దాడి చేసేది ఏంటి.. ప్రజలే జగన్‌పై దాడి చేసే రోజులు రాబోతున్నాయన్నారు. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నారాయణస్వామి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందచేసిన వస్త్రం తో సత్కరించారు. జ‌గ‌న్‌ను చూస్తే ప‌వ‌న్ కళ్యాణ్ కు అసూయ అని ఆయ‌న ఆరోపించారు. ఎన్నిక‌ల ముందే వైసీపీలో ప‌వ‌న్ కళ్యాణ్ చేరాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రిపారని ఆయ‌న అన్నారు. అయితే, అందుకు జ‌గ‌న్ ఒప్పుకోలేద‌ని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. త‌న‌కు అవ‌స‌రం లేద‌ని, ప్ర‌జ‌లు ఓట్లు వేస్తే తాను ముఖ్య‌మంత్రి అవుతాన‌ని జ‌గ‌న్ అన్నార‌ని నారాయణ స్వామి తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తున్నాన‌ని చెప్పిన సింహం జ‌గ‌న్ అని నారాయణ స్వామి అన్నారు. ప‌వ‌న్ ఏపీలోని గ్రామాల్లో ప‌ర్య‌టించ‌వ‌చ్చ‌ని, ఆయ‌న‌పై దాడి చేయాల్సిన అవ‌సరం త‌మ‌కు లేద‌ని చెప్పారు. ఏపీలో జ‌గ‌న్ ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేశార‌ని, ఆ ఈర్ష్య‌తోనే ప‌వ‌న్ మాట్లాడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. పేద‌ల కోసం జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్ట‌డం త‌ప్పా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌ను చూసి యువ‌కులు మాట్లాడ‌చ్చు కానీ నాది ఆయ‌న గురించి మాట్లాడేంత చిన్న మ‌న‌స్తత్యం కాదు. ప‌రిపాల‌న ద‌క్షత లేని ఉద్రేక‌పూరిత‌మైన వ్యక్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న ఎప్పుడు బీజేపీలో ఉంటాడో, ఎప్పుడు టీడీపీలో ఉంటాడో తెలియ‌దని అన్నారు నారాయణ స్వామి. ప్రజా సంక్షేమానికి సీఎం జ‌గ‌న్ తీసుకొచ్చిన న‌వ‌ర‌త్నాలను ఏవిధంగా త‌ప్పని అంటార‌ని నేను ప‌వ‌న్ ను ప్రశ్నిస్తున్నా.. వైపీపీ న‌వ‌ర‌త్నాల‌పై త‌ప్పుబ‌డుతున్న ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌పై ప్రజ‌లే తిరుగుబాటు చేసే ప‌రిస్థితి వ‌స్తుందని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు.

Related Articles

Back to top button