కరోనా కేసులు తగ్గుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న జిల్లాల్లో సోమవారం నుంచి కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజా కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ప్రజా కార్యకలాపాలకు అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ఈ నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. మిగిలిన 9 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలించారు. కొత్త సడలింపు సమయాలను జులై 7 వరకు పొడిగిస్తున్నట్టు జీవోలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 97,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,797 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 874 కొత్త కేసులు నమోదు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 105 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5,498 మంది కరోనా నుంచి కోలుకోగా 35 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 12,706 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 18,89,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,38,469 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,338 మందికి చికిత్స జరుగుతోంది.