అసని టెన్షన్.. అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం

0
793

అసని తుపాను ప్ర‌భావంతో ఏపీలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సహాయక చర్యలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది హై అలర్ట్‌గా ఉండాలన్నారు. తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే, తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమ‌ని చెప్పారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ క‌ల‌గ‌కుండా చూడాల‌ని ఆయ‌న అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల‌ని, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను తెరవాల‌ని సూచించారు. శిబిరాలకు తరలించిన కుటుంబాల‌కు ఆర్థిక సాయం కూడా చేయాల‌ని ఆయ‌న అన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాను ‘అసని’ బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కి.మీ., కాకినాడకు 150 కి.మీ, విశాఖకు 310 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను దిశ మార్చుకుని పశ్చిమవాయవ్య దిశగా కదులుతోంది. నరసాపురం వద్ద పూర్తిగా భూభాగంపైకి రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.