తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో సీఎం ను సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. వకుళ మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు, విమానానికి ఒక కలశం టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సీఎం జగన్ పారిస్ కు వెళ్లొచ్చు.. అనుమతులు మంజూరు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు భారీ ఊరటను ఇచ్చింది. పారిస్‌లో చదదువుతున్న తన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పట్ల కోర్టు సానుకూలంగా స్పందించింది. సీఎం జగన్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్ ఇద్దరు కుమార్తెలు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారిలో పారిస్‌లో చదువుతున్న కుమార్తె విద్యాభ్యాసం పూర్తి కాగా కళాశాల స్నాతకోత్సవానికి రావాలంటూ జగన్‌ను ఆయన కుమార్తె ఆహ్వానించారు. సీబీఐ కోర్టులో కేసుల విచారణ కారణంగా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి జగన్‌కు తప్పనిసరిగా మారింది.
తన కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇటీవలే జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌ను విదేశీ పర్యటనకు అనుమతించరాదని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. జగన్ విదేశాలకు వెళితే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతించింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటించేందుకు జగన్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసింది. పారిస్ పర్యటన వివరాలను సీబీఐ అధికారులతో పాటు కోర్టుకు కూడా సమర్పించాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది.