More

    ఏపీ సీఎం జగన్ బంధువు వైఎస్ కొండారెడ్డి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ చార్జ్ వైఎస్ కొండారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ లక్కిరెడ్డిపల్లె కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. రాయచోటి – పులివెందుల రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో కొండా రెడ్డి పై చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 386 , ఐపీసీ 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన్ను కడప ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కొండా రెడ్డిపై ఉన్న కేసుపై విచారించి , 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అక్కడ నుంచి కొండారెడ్డిని రాయచోటి సబ్ జైలుకు తరలించారు.

    వైఎస్ కుటుంబానికి బంధువైన వైఎస్ కొండారెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం పులివెందుల-రాయచోటి రహదారి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు కాంట్రాక్టు పనులు కర్నాటక లోని ఎస్.ఆర్.కే. కన్ స్ట్రక్షన్స్ సంస్ధ చేపట్టింది. కర్నాటకలోని ఓ బీజేపీ నేతకు చెందిన సంస్ధగా చెప్తున్నారు. ఈ సంస్ధ రోడ్డు పనులు చేస్తున్న సమయంలో చక్రాయపేటలో పనులు జరగాలంటే డబ్బులివ్వాలని వైఎస్ కొండారెడ్డి సదరు కాంట్రాక్టర్ ను బెదిరించారు. బెదిరింపులపై కాంట్రాక్టర్ సీఎం జగన్ ను నేరుగా ఆశ్రయించినట్లు తెలిసింది. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. చర్యలు తీసుకోవాలని స్ధానిక పోలీసుల్ని ఆదేశించారు. కడప పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొండారెడ్డి కాల్ డేటా పరిశీలించిన పోలీసులకు అతను సదరు కాంట్రాక్టర్ ను బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు నిర్ధారించారు. దీంతో కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపారు.

    Trending Stories

    Related Stories