More

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన జగన్ ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణలు ఉన్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలను తీసుకొచ్చారు. నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ఏపీ సీఎం ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.

    తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా.. ఇవాళ ఉదయం మలయప్పస్వామిని చినశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు దారిపోడవునా బారులు తీరి హారతులతో స్వాగతం పలికారు. వాహనం ముందు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

    Trending Stories

    Related Stories