రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన ఏపీ సీఎం.. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌

0
882

పీఆర్సీమీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించానని తెలిపారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ అందించడంతో పాటు, రిటైర్‌మెంట్‌ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నానని సీఎం జగన్‌ తెలిపారు.

కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. జూన్‌ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈహెచ్‌ఎస్‌ – ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు.

సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామన్నారు. ఆ రిబేటును కూడా ప్రభుత్వం భరిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పిన విధంగా, పీఆర్సీ అమలు చేసేనాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని స్పష్టం చేశానని అన్నారు. పెండింగులో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశించానన్నారు. సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబరు నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే జనవరి 1, 2022 నుంచే పీఆర్సీని అమలు చేసి, దాని ప్రకారం జీతాలు ఈనెలనుంచే ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కొత్త స్కేల్స్‌ను, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి 1 నుంచే, జనవరి జీతాలతోనే అమలు చేయాలని నిర్ణయించామన్నారు.