భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తోందని అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని.. పేదలు కూడా మంచి చదువులు చదవాలనేదే తమ లక్ష్యమని అన్నారు.
ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని లేదని సీఎం జగన్ అన్నారు. ఎవరూ అడగకుండానే ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచామని.. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులను కల్పించామని అన్నారు. విద్యాశాఖపైనే తాను ఎక్కువ సమీక్షలను నిర్వహించానని.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉపాధ్యాయులదేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో అనేక చర్యలను చేపట్టామని అన్నారు. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను సీఎం జగన్ ప్రదానం చేసి సత్కరించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురు ఈ పురస్కారాలను అందుకున్నారు.