మోసం చేయడంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు తోడు దొంగలు అంటూ జగన్ ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో రైతులకు పంటల బీమా పరిహారం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు.
2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబులు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతు ఆత్మహత్య చేసుకుంటే అతడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇచ్చామని.. పరిహారం అందని ఒక్క కుటుంబాన్ని అయినా చూపగలరా అని దత్తపుత్రుడికి సవాల్ విసిరితే.. ఇప్పటివరకు ఒక్క రైతు కుటుంబాన్ని కూడా చూపలేకపోయారని జగన్ చురకలు అంటించారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారంటూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో లంచాలు, వివక్ష లేకుండా అర్హులకు పారదర్శకంగా పథకాలు చేరుతున్నాయని సీఎం జగన్ అన్నారు. ఒకప్పుడు అనంతపురం కరవు జిల్లా అయితే ఇప్పుడు దేవుడి దయ వల్ల నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయని జగన్ తెలిపారు. చంద్రబాబు ఐదేళ్లలో పంటల బీమా కింద 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411 కోట్లు ఇస్తే తాను మూడేళ్లలోనే 44.28 లక్షల మంది రైతులకు రూ.6,685 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నారు. తాము మంచి పని చేస్తుంటే పచ్చమీడియా అంతా ఏకమై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ప్రజలను మోసం చేస్తాయని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు హయాంలో నష్టపరిహారం రాకుంటే పవన్ ఎక్కడున్నారని నిలదీశారు. చంద్రబాబుకు మంచి చేయడమే దత్తపుత్రుడి ఆలోచన అని జగన్ సెటైర్లు వేశారు.
రైతన్నలకు మేలు చేసే విషయంలో గత ప్రభుత్వాలతో కాకుండా దేశంతో పోటీ పడుతున్నామని సీఎం జగన్ అన్నారు. మన రాష్ట్రంలో మార్పులు చూసేందుకు కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల పెద్దలు వస్తున్నారని, ఆర్బీకేలను సందర్శిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా కింద మూడేళ్లలో ఏకంగా రూ.23,875 కోట్లను రైతన్నల చేతిలో పెట్టామని తెలిపారు. రూ.1613 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇచ్చామన్నారు. రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మూడేళ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.25,800 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. రైతుభరోసా కేంద్రాలు రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయని, యంత్ర పరికరాలు, సలహాలు అక్కడే దొరుకుతున్నాయని పేర్కొన్నారు.