అత్యాచారాలపై ఆందోళన బాటపట్టిన ఏపీ బీజేపీ

0
893

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలను తక్షణం నిలుపుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్‌ విభాగం డిమాండ్‌ చేస్తోంది. ఒక్కసారి గెలిపిస్తే జీవితాల్లో మార్పుతెస్తానన్న జగన్‌ మహిళల బతుకుల్లో నిప్పులు పోస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కాలంలో మహిళలకు భద్రతే లేకుండా పోయిందని ఆరోపించారు. వారిపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. తొమ్మిది నెలల పసికందు నుంచి 60 ఏళ్ల వృద్దురాలి వరకు వయసుతో తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 31 అత్యాచారాల కేసులు నమోదవ్వడం రాష్ట్రంలో భయానక పరిస్థితికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా వాటిని నియంత్రించే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మహిళా మోర్చా విమర్శిస్తోంది.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో, విజయనగరం పట్టణంలోని ఊడా కాలనీలో, రేపల్లె, పిడుగురాళ్లల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు మానవత్వానికే సిగ్గుచేటుగా అభివర్షించారు. గుంటూరులో మైనర్‌బాలికను వ్యభిచారం చేయించిన కేసు, మరో బాలిక స్నానం చేస్తుంటే వీడియో తీసిన వాలంటీర్‌ భర్త వైసీపీ నేతలేనన్నారు. ముద్దాయిల్లో చాలా మంది వైసీపీ నేతలే ఉండటం ఆ పార్టీకే సిగ్గుచేటని విమర్శించారు. వీరిని కట్టడి చేయలేని నాయకత్వం మన రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే రాష్ట్ర హౌం శాఖ మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా తల్లిదండ్రుల పెంపకంపై మాట్లాడటం విచిత్రంగా ఉందని మండిపడ్డారు. ఈ ఘటనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సమాధానం చెప్పకుండా పిల్లలను పెంచిన తల్లిదండ్రులపై ఆరోపణలు చేయడాన్ని మహిళా మోర్చా ఆక్షేపిస్తోంది.

వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తమ అవసరాలకు వాడుకోవడంతో పోలీసులు కూడా బాధ్యతలేనట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నిందితులు పోలీసు వ్యవస్థను ఏమాత్రం లెక్క చేయడం లేదని… చట్టం అంటే భయపడటం లేదని అన్నారు. మహిళలను తమ కోర్కెతీర్చే వస్తువుగా మాత్రమే భావిస్తూ, తమను ఎవరేం చేయలేరనే అహంభావంతో ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా బాధితులపై ఉపేక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. నిందితులు అధికార పార్టీకి చెందినవారైనా, కుల, మతాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు చేశారు. ఇలాంటి చర్యలను మహిళా మోర్చా తప్పుపడుతోందని తెలిపారు.

తెల్లవారితే ఏ ఘటన పేపర్లో చదవాల్సివస్తోందోనని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మహిళలు వారిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి బయట చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. పేద కుటుంబాలకు చెందిన బాలికలు, మహిళలు తీవ్రమైన అభద్రతా వాతావరణంలో జీవిస్తున్నారు. ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలను ఇకనైనా నియంత్రించాలి. విచ్చలవిడి మద్యం విక్రయాలు, మాదక ద్రవ్యాల సరఫరానే ఇలాంటి నేరాలకు కారణం. తక్షణం వీటిని నియంత్రించాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిందితులు ఎలాంటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహిళలకు ప్రభుత్వం ఆర్థికంగా, మానసికంగా అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేయాలన్నారు. మహిళల రక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని లేకుంటే మహిళలే ప్రభుత్వాన్ని సమాధి చేస్తారని మహిళా మోర్చా హెచ్చరించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × 1 =