ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏది మాట్లాడుతున్నా వివాదం అవుతోంది. కొద్దిరోజుల కిందట లిక్కర్ విషయంలో ఆయన నోరుజారి విమర్శలు పాలయ్యారు. ఇప్పుడు ఆయన ‘హత్యలు చేసిన వారి జిల్లాలకు ఎయిర్‌పోర్టులా’ అంటూ మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్‌పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్‌పోర్టు.. రాయలసీమకు ఎయిర్‌పోర్టులంట.. కడపలో ఎయిర్‌పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు. మేం ఎయిర్‌పోర్టు వేస్తాం. ఏం వేస్తారండి ఎయిర్‌పోర్టు.. మీరు రోడ్లు వెయ్యండి..’ అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
హత్యలు చేసిన వారి జిల్లాలకు ఎయిర్‌పోర్టులా అంటూ గురువారం నాడు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో సోమువీర్రాజు వ్యాఖ్యానించడంపై రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రజలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండున్నర ఏళ్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలే తమ పార్టీ విధానమని సోము వీర్రాజు చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తాము గతంలోనే చెప్పామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అల్లకల్లోలం సృష్టిస్తోందని వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. రాష్ట్రంలో రోడ్లపై తిరిగే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ను మోదీ ప్రభుత్వమే అభివృద్ది చేస్తోందన్నారు.
వివాదం ముదురుతుండటంతో సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. వివేకా హత్యను దృష్టిలో వుంచుకునే తాను అలా మాట్లాడానని ఆయన అన్నారు. కడప ప్రజలకు హత్యా రాజకీయాలకు సంబంధం లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప, కడప ప్రజలను కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రజలకు, హత్యారాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. విశాఖలో తాను చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. ఎయిర్ పోర్టుల సంగతి కేంద్రం చూసుకుంటుంది గానీ, ముందు మీరు రోడ్లు వేసుకోండి అంటూ చెప్పానని వివరించారు. తాను మాట్లాడింది కొందరు వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని మాత్రమేనని, తన మనసులో కడప జిల్లా ప్రజలపై ఎలాంటి దురభిప్రాయంలేదని అన్నారు. తనకు కడప జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు, సంస్కృతీ సంప్రదాయాలు, నమ్మితే ప్రాణమిచ్చే తెగింపు గురించి బాగా తెలుసని వెల్లడించారు. ఈ విషయంలో కడప జిల్లా ప్రజలకు మరెవరూ సాటిరారని సోము వీర్రాజు కొనియాడారు. కడప జిల్లా ప్రజలకు మోసం చేయడం తెలియదని, కానీ సీఎం జగన్ కుటుంబాన్ని ఆదరిస్తూ పదేపదే మోసపోతుంటారని తెలిపారు. కడప జిల్లా ప్రజలు ఇకనైనా వారి మాయ నుంచి బయటపడి అభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఆ వివరణ సరిపోకపోవడంతో సోము వీర్రాజు క్షమాపణలు తెలిపారు. రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. రాయలసీమ రతనాల సీమ.. ఈ పదం నా హృదయంలో పదిలమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయని.. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసునని అన్నారు.