ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే 2021-2022 బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్‌తో పాటు ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదించాలని రాష్ట్రం ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహాలు రెడీ చేస్తోంది.
అంతకుముందు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం ఏటూ తేల్చుకోలేకపోతోందని వార్తలు వచ్చాయి. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై క్లారిటీ రాకపోవడంతో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడినట్టు సమాచారం. ఒకదశలో బడ్జెట్ కోసం మరోసారి ఆర్డినెన్స్ పెట్టడమా..? ఓటాన్ అకౌంట్‌కు వెళ్లడమా..? అనే అంశాలపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే బడ్జెట్ సమావేశాలను 19 నుంచి నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో.. సస్పెన్స్ కు తెరదించినట్టయ్యింది.