కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం (డీఏ), పింఛన్‌దారులకు ఇచ్చే కరువు ఉపశమనాన్ని (డీఆర్) పునరుద్ధరించడమే కాకుండా వాటిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏ/డీఆర్‌ను 28 శాతానికి (11 శాతం పెంపు) పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. డీఏ/డీఆర్ పెంపు వల్ల ఖజానాపై అదనంగా రూ.34,401 కోట్ల మేర భారం పడనుంది. ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
గతేడాది పెంచిన డీఏను నిలిపివేస్తూ వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ తాజాగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేబినెట్ నోటు విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల డీఏ పెండింగ్‌లో ఉంది. జనవరి 1, 2020 నుండి జూన్ 30, 2020 వరకు- 4%, జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు – 3%, జనవరి 1, 2021 నుండి జూన్ 30, 2021 వరకు 4% డీఏ పెండింగ్‌లో ఉంది. డీఏ పునరుద్ధరణతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేతికి అందే జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలో కూడా పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుందని అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు.