జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లతో దాడులు చోటు చేసుకోవడంతో భారత సైన్యం మరింత అలర్ట్ అయ్యింది. ఇకపై డ్రోన్ లను ఎదుర్కోడానికి భారత్ ఆర్మీ కట్టుదిట్టమైన చర్యలను తీసుకోడానికి సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా సైనిక స్థావరాల వద్ద యాంటీ-డ్రోన్ వ్యవస్థలను భారత్ తీసుకొని రాబోతోంది. ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ స్మాష్ 2000 ప్లస్ ఫైర్ ను సాయుధ దళాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయని తెలిపింది. త్వరలోనే పెద్ద ఎత్తున వీటిని భారత్ వినియోగించనుంది. జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్టేషన్ వద్ద రెండు బాంబులను పడవేసేందుకు ఆదివారం దేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ దాడి జరిగింది. వీలైనంత త్వరగా దేశ వ్యాప్తంగా మిలిటరీ స్థావరాల వద్ద యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇజ్రాయెల్ నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ స్మాష్ 2000 ప్లస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది.
భారత నౌకాదళం ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి వాటిని దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు వాటి సంఖ్యను మరింత పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అత్యవసర కొనుగోళ్ల కింద వాటిని దిగుమతి చేసుకునే దిశగా చర్చలు జరపాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ స్మాష్ 2000 ప్లస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ డ్రోన్లను కూల్చగలుగుతుంది. ఈ వ్యవస్థలు రాత్రి సమయంలోనూ పనిచేస్తాయి. డ్రోన్లతో పాటు ఇతర చిన్న పాటి వస్తువులనూ గుర్తించి, వాటిపై దాడి చేస్తాయి. ఈ వ్యవస్థలపై ఏకే-47 లేదా ఇతర రైపిళ్లను ఉంచి డ్రోన్లపై దాడులు చేస్తారు. ప్రస్తుతం భారత సైనికులు డ్రోన్లను అత్యాధునిక రైపిళ్ల ద్వారా కాల్చే పద్ధతిని పాటిస్తున్నారు. వాటికి చిక్కకుండా డ్రోన్లు సునాయాసంగా తప్పించుకుంటున్నాయి. డ్రోన్లపై ఆటోమెటిక్‌గా దాడి చేసే వ్యవస్థ కోసం భారత్ ప్రయత్నిస్తోంది. త్వరలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా డ్రోన్లను నేలకొరిగించేయొచ్చు.
ఆర్టికల్ 370 ను రద్దు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు పాక్ నుంచి 300కి పైగా డ్రోన్లు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. మొదట ఆయుధాలు, డ్రగ్స్ వంటివి సరఫరా చేసేందుకు జమ్మూకశ్మీర్‌లోకి పాక్ డ్రోన్లను పంపింది. తొలిసారి వైమానిక స్థావరంపై దాడి చేయడంతో భవిష్యత్తులో వాటివల్ల పొంచి ఉన్న ముప్పును గ్రహించిన భారత్ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా తెచ్చుకోవాలని భావిస్తోంది. డ్రోన్లతో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. రాబోయే రోజుల్లో భారత్ పై ఎటువంటి డ్రోన్ దాడులు జరగకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకుని వస్తున్నారు.
జమ్మూలోని రత్నుచక్ ప్రాంతంలోని కుంజ్వానీ వద్ద నిన్న అర్థరాత్రి డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయని మీడియా సంస్థలు మంగళవారం ఉదయం తెలిపాయి. జమ్మూ డ్రోన్ దాడి కేసు దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కు అప్పగించినట్లు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. పఠాన్‌కోట్ నేషనల్ హైవేపై కాలుచాక్-పూర్మాండల్ ప్రాంతంలో రెండు క్వాడ్‌కాప్టర్స్ కనిపించాయి. కాలుచాక్ మిలిటరీ స్టేషన్‌కు దగ్గరగా ఎగురుతూ కనిపించాయి అని పోలీసులు వెల్లడించారు. ఆర్మీ జవాన్లు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలతో జమ్ము ప్రాంతంలోని ఆర్మీ స్టేషన్లలో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్ములో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై తొలిసారి డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే ఇలా మరో రెండు డ్రోన్లు కనిపించాయి.