పవర్ స్టార్ చుట్టూ ఏపీ రాజకీయం..! బీజేపీ-జనసేన మైత్రికి బీటలు..?

0
941

మొన్నటి దాకా నత్తనడకన సాగిన నవ్యాంధ్ర రాజకీయాలు ఆగంతుకంగా మారిపోయాయి. జన సేనాని నిర్వహించ తలపెట్టిన ‘జనవాణి’ కార్యక్రమం, అధికార వైసీపీ ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన ‘విశాఖ గర్జన’ సభలు ఒకే రోజు ఉండటం రసాభాసకు, ఇరు పార్టీల పరస్పర ఘర్షణకు దారితీసింది. పవన్ కళ్యాణ్ పర్యటనపై ఆంక్షలు విధించడంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహోదగ్రులయ్యారు.

మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఉన్మాద స్థాయిలో దాడికి దిగడం, అందుకు ప్రతిగా జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి దాడికి దిగడంతో రాజకీయ ఉద్రక్తత చోటు చేసుకుంది. సముద్ర తీరంలో ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ నోవోటెల్ చుట్టూ ఆసక్తికరమైన రాజకీయం మొదలైంది. మరుసటి రోజు రాజకీయం మంగళగిరికి చేరింది. జనసేన-వైసీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇరు పార్టీలూ గరిష్ఠ స్థాయిలో పరుష పదజాలాన్ని ఉపయోగించాయి.

చంద్రబాబు రాజకీయ మెళకువలు బాగానే పనికొచ్చాయి. బీజేపీతో జట్టు కట్టిన జనసేనాని తెలివిగా మచ్చిక చేసుకుంటున్నాడు చంద్రబాబు. పరామర్శ పేరుతో పలకరింపునకు వచ్చి, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఐక్యసంఘటన ప్రతిపాదన ముందుకు తెచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాడ్ చంద్రబాబు చాణక్యాన్ని పసిగట్టేలోపు తెలియకుండానే ఉచ్చులోకి దూరిపోయారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని లాభపడదామని ఆశించిన ఏపీ బీజేపీ తాజా పరిణామాలతో డోలాయమానంలో పడింది. ఇంతకూ పవర్ స్టార్ తమతో ఉన్నట్టా లేనట్టా? అనే అనుమానం నవ్యాంధ్ర కమలనాథులను వేధిస్తోంది.

ఇంతకూ నవ్యాంధ్ర రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతోంది? బీజేపీ-జనసేన మధ్య నిజంగానే విభేదాలు పొడచూపాయా? పవన్ కళ్యాణ్ తో పొత్తుపెట్టుకుంటే తప్ప టీడీపీ గెలవలేదని చంద్రబాబు భావిస్తున్నారా? బీజేపీని వదులుకుని పవన్ తప్పు చేస్తున్నారా? జనసేన, టీడీపీ, సీపీఎం, సీపీఐలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగాలని బాబు భావిస్తున్నారా? నిజంగానే ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోందా?

నవ్యాంధ్ర రాజకీయ అనిశ్చితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

మంగళగిరి జనసేన కార్యాలయంలో అక్టోబర్ 18న ఏర్పాటు చేసిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ‘యాంగ్రీ యంగ్ మెన్’ అవతారమెత్తారు. వైసీపీపై నిప్పులు చెరిగారు.  తన సహనమే వైసీపీని కాపాడిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ స్టార్‌ అని ఎవరైనా మాట్లాడితే దవడలు వాచిపోయేలా కొడతానంటూ హెచ్చరించారు. వెధవల్లారా…సన్నాసుల్లారా అంటూ వైసీపీ నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ తన కాలి చెప్పు తీసి చూపించారు. మెడ పిసికి చంపేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు. తాను విడాకులు ఇచ్చే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. మీ లాగా ఒక పెళ్లి చేసుకుని 30 మందితో తిరగట్లేదని వైసీపీ నేతలనుద్దేశించి కామెంట్ చేశారు. వైసీపీ గూండాలు ఎంతమంది వస్తారో..రండి చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. ఇవాల్టి నుంచి ఇక యుద్ధమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాళ్ల, రాడ్లా దేనికైనా సిద్ధమేనన్నారు. ఇప్పటివరకు తనలో శాంతి, సహనం మాత్రమే చూశారని చెప్పారు. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

బూతుల పంచాంగం విప్పితే నిలబెట్టి తోలుతీస్తా అంటూ హెచ్చరించారు. వైసీపీలో అందరూ నీచులు కాదని..కానీ నీచుల సంఖ్య ఎక్కువన్నారు. మాట్లాడితే రాయలసీమ వెనుకబాటుతనం అంటున్నారని…రాయలసీమను వెనకబాటు తనానికి కారణమేవర్రా అంటూ ప్రశ్నించారు.

అధికార వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ పై బూతుపురాణం లంకించుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని పత్రికా విలేకరుల సమావేశంలో పవన్ పై విరుచుకుపడ్డారు. అరే..తొరే అని పరుషంగా సంబోధిస్తూ…తిట్లచట్టా విప్పారు. పవన్ చంద్రబాబు తొత్తు అంటూ ఎద్దేశా చేశారు.

పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసిన కాసేపటికే చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్ హోటల్ కి రావడం, జనసేనానితో పత్యేకంగా భేటీ కావడం రాజకీయ ఉత్కంఠకు తెరలేపింది. సమావేశం అనంతరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు వైసీపీపై చేసిన విమర్శల కన్నా, జనసేనతో కలిసి పనిచేస్తామంటూ…నర్మగర్భంగా చెప్పడమే మరింత సంచలనానికి కారణమైంది. పవన్ సైతం అవసరమైతే తాను వ్యూహాలు మార్చుకుంటాననడం, అవసరమైతే త్వరలోనే మరోసారి సమావేశమవుతామని ప్రకటించడం…అనేక ఊహాగానాలకు తావిస్తోంది. నిజంగానే టీడీపీ-జనసేన జట్టు కట్టే అవకాశం ఉందా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు మాత్రం తాను కేవలం పరామర్శకు మాత్రమే వచ్చానంటూ తేల్చి చెప్పారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తుందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు బాబు-పవన్ రాజకీయ దోస్తీనీ రూఢీ చేస్తున్నాయంటారు రాజకీయ పరిశీలకులు. కేవలం ఒక భేటీని ఆధారం చేసుకుని అంతిమ తీర్మానాలు చేయడంలో అర్థం లేదనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు బీజేపీ మాత్రం రాబోయే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయనీ, ఇరు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేస్తాయని ప్రకటించడంతో జనసేన బీజేపీతో ఉందా అనే సందేహం బాహటంగానే వ్యక్తమవుతోంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో సందిగ్ధత, అనిశ్చితి కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది. 

గడచిన మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై రావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. అయితే ప్రతిపక్షాలపై ప్రజలకు విశ్వాసం పాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత చంద్రబాబుపై నమ్మకంగా తర్జుమా కాలేదు. బీజేపీ పరిస్థితి కూడా సుమారుగా ఇలాగే ఉంది. ఈ మొత్తం పరిస్థితిని మదింపు వేసిన చంద్రబాబు జనాకర్షణ ఉన్న జనసేనానిని మచ్చిక చేసుకుని ఉమ్మడిగా బరిలోకి దిగితే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపవచ్చని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ-జనసేన మధ్య సఖ్యత లేకపోవడాన్ని గమనించిన చంద్రబాబు ‘విశాఖ పరిణామాల’ను తనకు అనుకూలంగా మలచుకునేందుకు పావులు కదుపుతున్నారు.

జాతీయ పార్టీ అయిన బీజేపీకి పవర్ పవన్ కళ్యాణ్ దూరమవ్వడం జనసేనకు నష్టంగానే పరిణమిస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. పైగా కమ్యూనిస్టులతో దోస్తీ కట్టడం వల్ల నష్టమే తప్ప లాభం లేదనే వాదనలూ ఉన్నాయి. ఒక వేళ టీడీపీతో పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో  బరిలోకి దిగి విజయం సాధించినా…అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆధిపత్యం సాంతం చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోవడం ఖాయమంటారు రాజకీయ పరిశీలకులు.

పవన్ కళ్యాణ్ తో చేతులు కలపడం వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓటర్లను తనవైపు తిప్పుకోవచ్చనే వ్యూహం కూడా ఉండవచ్చంటారు. సామాజిక వర్గాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా….పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా కూడా ఉపయోగపడుతుందని కూడా చంద్రబాబు భావిస్తుండవచ్చు.

బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ దూరం చేసేందుకు చంద్రబాబు చాలా తెలివిగా పావులు కదుపుతున్నట్టూ తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. బాహటంగా బీజేపీని వ్యతిరేకించకుండా….చాపకింద నీరులా..కమలం పార్టీని ఒంటరి చేయాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది.

ఒక వేళ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? చూద్దాం….

వైసీపీ నేతలు ముందునుంచీ పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ పొలిటీషియన్ అనీ, సీజన్డ్ రాజకీయ నాయకుడనీ, రాజకీయ స్తిమితం లేదంటూ విమర్శిస్తూనే ఉన్నారు. ఒక వేళ నిజంగానే పవన్ కళ్యాణ్ టీడపీతో పొత్తు పెట్టుకుంటే…వైసీపీ ఓ అస్త్రం దొరికినట్టవుతుంది. తాము చెప్పిందే జరుగుతోందని ప్రచారం లంకించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ తరహా ప్రచారం జనసేనకు కీడు తలపెట్టవచ్చు. ప్రజల్లో చంద్రబాబు పట్ల ఉన్న వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకతగా వ్యక్తమవుతే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. టీడీపీ-జనసేన పొత్తు ఆచరణ రూపు దాల్చితే ….సీట్లు తగ్గినా…మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటారు రాజకీయ పరిశీలకులు.

అలా కాకుండా బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకే ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. బీజేపీకి ఎట్లాగూ తక్కువ స్థానాలు వస్తాయి కాబట్టి పగ్గాలు పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా పాలనలో కొత్త సంస్కరణలు తీసుకురావచ్చు. కేంద్రంలో మరో సారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి…కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా తొడవుతుంది. బీజేపీ-జనసేన పొత్తును జనం కూడా అంగీకరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీ-జనసేన కూటమిపై నమ్మకంగా అనువదితమవుతుందనే వాదనలో నిజం లేకపోలేదు. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు మొదలైంది. అయితే ఈ కుదుపులో అనిశ్చితి ఉంది. సందిగ్ధత అందుకు తోడైంది. నవ్యాంధ్ర రాజకీయ ముఖచిత్రం మారాల్సిన తరుణం ఆసన్నమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బీజేపీతోనే ఉంటారా? చంద్రబాబుతో కలుస్తారా? అన్నది తేల్చుకుంటే క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here