తమిళనాడు ద్రవిడ రాజకీయాల్లో మరోక వారసుడొచ్చాడు. ద్రవిడ పార్టీల నేతలు పైకి ఎన్ని సిద్ధాంతాలు వల్లేవేసిన… ఆ రాష్ట్రంలో మొదటి నుంచి పార్టీలు అన్ని వ్యక్తి కేంద్రంగా…, ఆ తర్వాత కాలంలో కుటుంబ పార్టీలుగా రూపాంతరం చెందాయనేది వాస్తవం. ఆయా పార్టీల్లో వారు బ్రతికున్నంతకాలం వారే అధ్యక్షులుగా ఉంటారు. వారి తదనంతరం వారి శ్రీమతి, లేదంటే కుమారుడు, కాదంటే కూతురు, ఇంకా మనువడు వాళ్లే పార్టీ అధ్యక్షులుగా ఉంటారు. ఓ సామాన్యకర్త ఆయా పార్టీలకు అధ్యక్షుడు కాలేడనేది కఠిన వాస్తవం.!
ప్రస్తతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. డీఎంకే దివంగత నేత కరుణానిధి కుమారుడు స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టాడు. ఆయన నేతృత్వంలోనే పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. కరుణానిధి పెద్దకుమారుడు… డీఎంకే నుంచి సస్పెన్షన్ కు గురైన ఎం.కె అళగిరికి…, స్టాలిన్ కు మధ్య వారసత్వ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.అళగిరి కొత్త పార్టీ పెడతానే ప్రచారం జరిగినా ఎందుకనో వెనుకడుగు వేశాడు.
మరోవైపు పార్టీపట్టును మరింత పెంచుకుని..ఏకఛత్రధిపత్యంగా తన కుటంబం చేతుల్లోనే పార్టీ ఉండాలని వ్యూహం రచించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్…ఈ ఎన్నికల్లో వద్దు వద్దు అంటూనే తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను తొలిసారిగా ఎన్నికల బరిలోకి దింపాడు. ఉదయనిధి స్టాలిన్ ట్రిప్లికేన్ నుంచి డీఎంకే తరపున బరిలో నిలిచాడు. దీంతో కరుణానిధి వంశంలో మూడు తరం కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేసినట్లు అయ్యింది.
తన సోదరుడితో పార్టీ కోసం జరుగుతున్న వారసత్వ పోరులో స్టాలిన్ కు సోదరి కనిమొళి అండగా నిలిచారు. ఉదయనిధిని ఎన్నికల బరిలోకి దించాలనేది స్టాలిన్ కుటుంబంతోపాటు కనిమొళి నిర్ణయంగా కూడా ప్రచారం జరుగుతోంది. డీఎంకే పార్టీకి అసలైన అధినేత తన సోదరుడు స్టాలినేనని ఆమె అనేక సార్లు స్పష్టం చేశారు. స్టాలిన్ కూడా దూరదృష్టితో రెండేళ్ల క్రితమే తన కుమారుడి చేత సైలెంట్ గా పార్టీలోకి తీసుకువచ్చాడు. తాను అధ్యక్షుడు అయితే… తన కుమారుడిని యువజన విభాగం కార్యదర్శిగా చేసి.., ఇకపై డీఎంకే పార్టీ నాకు, నా కుటుంబానికి మాత్రమే సొంతమనే సందేశం ఇచ్చాడు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ బరిలో నిలిచిన చెన్నైట్రిప్లికేన్ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా పేర్కొంటారు.
మరోవైపు డీఎంకే పార్టీపై హక్కు కోసం ఎన్నికల సమయంలో తన సోదరుడు స్టాలిన్ తో పోరాడానికి ఇది సమయం కాదని అళగిరి భావిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. డీఎంకే విజయవకాశాలు దెబ్బతీసేడానే అపవాదు ను మూటగట్టుకోవడం ఇష్టం లేకనే, ప్రస్తుతం ఆళగిరి మౌనంగా ఉంటున్నాడని చెబుతున్నారు. దక్షిణ తమిళనాడు జిల్లాలో ఇప్పటికి కూడా అళగిరికి మంచి పట్టుందని, ఆయన్ను అభిమానించేవారు డీఎంకేలో ఇప్పటికీ కూడా ఉన్నారని, సమయం వచ్చినప్పుడు వారంతా అళగిరికి అండగా ఉంటారనే ప్రచారం కూడా ఉంది.
అంతేకాదు.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో డీఎంకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై ఆధిపత్యం కోసం కరుణానిధి కుటుంబంలో అసలు ఘర్షణ మొదలవుతుందని, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే అళగిరి సైతం తన పావులు కదుపుతారని, ఈ క్రమంలో డీఎంకే పార్టీ ముక్కలైనా ఆశ్చర్య పోవాల్సింది ఏమిలేదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో ప్రస్తుతానికి ఆల్ ఈజ్ వెల్ గా ఉన్న డీఎంకేలో.., మే 2న ఫలితాల తర్వాత అసలు యుద్ధం మొదలవుతుందా.? జస్ట్ వెయిట్ అండ్ సీ.