సిద్ధూ హత్య కేసులో టాప్ షూటర్ అరెస్ట్..!

0
765

పంజాబీ సింగ‌ర్ సిధ్దూ మూసేవాలాను హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుల కోసం బృందాలను ఏర్పాటు చేసిన ఇతర రాష్ట్రాలు, దేశాలను సైతం జల్లెడ పడుతున్నారు. తాజాగా సిద్ధూ మర్డర్ కేసులో షార్ప్ షూట‌ర్ హ‌ర్‌క‌మ‌ల్ రానూను అరెస్టు చేశారు.

భ‌టిండాలో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. హ‌ర్‌క‌మ‌ల్‌ను పోలీసులకు అప్ప‌గించిన‌ట్లు అత‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. మూసేవాలాను హత్య చేసిన 8 మంది షూట‌ర్ల‌లో హ‌ర్‌క‌మ‌ల్ ఒక‌డు. కానీ ఆ హ‌త్య‌తో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని హ‌ర్‌క‌మ‌ల్ చెప్పిన‌ట్లు అత‌ని తాత‌య్య గురుఛర‌ణ్ సింగ్ వెల్ల‌డించాడు.

మూసేవాలా హ‌త్య క‌సులో ఇంట‌ర్‌పోల్ రెడ్‌కార్న‌ర్ నోటీసులు జారీ చేసింది. స‌తింద‌ర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పేరుమీద ఆ నోటీసులు జారీ అయ్యాయి. సిద్దూ మూసేవాలాను తానే చంపిన‌ట్లు గోల్డీ బ్రార్ బాధ్య‌త తీసుకున్నారు. ప్ర‌స్తుతం కెన‌డాలో ఉంటున్నాడ‌త‌ను. మ‌రో రెండు కేసుల్లో బ్రార్‌కు పంజాబ్ పోలీసులు రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేశారు. 2017లో స్టూడెంట్ వీసాపై కెన‌డా వెళ్లిన బ్రార్ ఆ త‌ర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీల‌క స‌భ్యుడిగా మారాడు. ఇక లారెన్స్ ముఠా సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. అయితే సిద్దు మూసేవాలా హత్యలో పాల్గొన్న ప్రధాన షూటర్ ఇంకా దొరకలేదని తెలిపారు. ప్రధాన షూటర్ కు సన్నిహితుడైన సిద్దేశ్ కమ్లేని ఇప్పటికే పూణేలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురు నిందితులను గుర్తించామని వివరించారు.

అయితే రాష్ట్రంలో ఆప్ స‌ర్కార్ ప్ర‌ముఖుల‌కు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ మ‌రుస‌టి రోజే దారుణ హ‌త్య‌కు గుర‌య‌యాడు సింగ‌ర్ సిద్దూ. ఈ దారుణ ఘ‌ట‌నపై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు సీఎం భ‌గ‌వంత్ మాన్. జ్యూడిషియ‌ల్ ఎంక్వ‌యిరీకి ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో హ‌ర్యానా, పంజాబ్ కోర్టు సెక్యూరిటీ ఎందుకు తొల‌గించాల్సి వ‌చ్చింద‌నే దానిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చింది. ఆ వెంట‌నే ఉప సంహ‌రించుకున్న సెక్యూరిటీని తిరిగి ప్ర‌ముఖుల‌కు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది పంజాబ్ ప్ర‌భుత్వం. గ‌త ఏడాది హ‌త్య‌కు గురైన అకాళీద‌ళ్ యువ నేత విక్కీ మిడ్డుకేరాకు ప్ర‌తీకారంగా మూసేవాలాను హ‌త్య చేసిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సిద్దూ మ‌ర్డ‌ర్ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 8 మందిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు చెప్పారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మూసేవాలా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. మ‌న్సా జిల్లాలో అత‌న్ని కొంద‌రు కాల్చి చంపారు. అత‌ని వాహ‌నం వ‌ద్ద 30 ఖాళీ బుల్లెట్ కేస్‌ల‌ను గుర్తించారు.

ఇక మూసేవాలా పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి శరీరంపై 24 బుల్లెట్ గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. మూసేవాలా పుర్రెలోనూ ఓ బుల్లెట్ ను గుర్తించారు. హత్యకు గురైన రోజున మూసేవాలా తన వాహనంలో ఇద్దరు సన్నిహితులతో కలిసి వెళుతున్నారు. మూసేవాలాను అటకాయించిన దుండగులు ఆ వాహనంలో మరో ఇద్దరు ఉన్నప్పటికీ, కేవలం మూసేవాలాను గురిచూసి కాల్పులు జరిపారు. పదుల సంఖ్యలో బుల్లెట్లు ఆ గాయకుడి శరీరాన్ని ఛిద్రం చేశాయి. శక్తిమంతమైన అస్సాల్ట్ తుపాకులతో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్లు మూసేవాలా దేహం నుంచి అవతలి వైపుకు దూసుకెళ్లాయి. పోస్టుమార్టం చేసిన వైద్యులు 24 బుల్లెట్ల తాలూకు ‘ఎంట్రీ అండ్ ఎగ్జిట్’ ఆనవాళ్లను గుర్తించారు. లోపలి అవయవాలన్నీ బుల్లెట్ గాయాలతో దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here