భద్రతను కట్టుదిట్టం చేసినా.. నిఘా వ్యవస్థను బలోపేతం చేసినా.. కశ్మీర్ లోయ రక్తసిక్తమవుతూనేవుంది. పాక్ ప్రేరేపిత ముష్కరమూకలు దొంగదెబ్బతీస్తూనేవున్నాయి. కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తుండటాన్ని జీర్ణించుకోలేపోలేని ఉగ్రమూకలు.. కశ్మీరీ పండిట్లను దొంగచాటుగా మాటువేసి చంపుతున్నారు.
తాజాగా షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల తూటాలకు మరో కశ్మీరీ పండిట్ బలయ్యాడు. చౌదరి గుండ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూరన్ క్రిషన్ భట్ అనే కశ్మీర్ పండిట్‌పై అతని ఇంటి ముందే టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దాంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. నొప్పితో విలవిల్లాడుతున్న పండిట్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కశ్మీరీ పండిట్ పూరన్ క్రిషన్‌ను ఉగ్రవాదులు హత్య చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ధృవీకరిస్తూ ట్వీట్ చేశారు. పండిట్‌ను హత్య చేసిన ఏరియాతో పాటు సమీప ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేశారు. ఘటనాస్థలాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
మృతుడు పండిట్ భట్‌కు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు 7వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి కాగా, మరో అబ్బాయి ఐదో తరగతి చదువుతున్నాడు. పూరన్ భట్ తన ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టడం చాలా అరుదని.. ఇంటి లోపల ఉండేవాడని అలాంటి వ్యక్తిపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని అతని బంధువు చెప్పారు. ఈ ఘటనతో తాము చాలా భయపడ్డామన్నారు.
ఇదిలావుంటే, కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత ప్రకటించుకుందని డీఐజీ సుజిత్ కుమార్ తెలిపారు. ఎందుకు హత్య చేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధితుడు స్కూటర్‌పై బయటకు వెళ్లి తిరిగి వచ్చాడని.. అతడితో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారని తెలిపారు. ఒక్కడే వచ్చి దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని అన్నారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గార్డు సహా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సుజిత్ కుమార్ స్పష్టం చేశారు.
ఉగ్రవాదుల చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాయి.
మరోవైపు షోపియాన్‌లో పురాణ్ క్రిషన్ భట్ హత్యకు వ్యతిరేకంగా జమ్మూలోని వలస కశ్మీరి పండిట్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ హత్యలను ఆపాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో ఈ నిరసనలు ఉద్యోగులు పాల్గొన్నారు. టెర్రరిస్టులు తమనే టార్గెట్ చేశారని.. తాము అక్కడ పనులు చేయలేమని గతంలో కూడా వారు చెప్పారు. తాజా ఘటనతో వారి ఆందోళన మరింత పెరిగింది.
కొద్ది నెలల క్రితం ఇదే షోపియాన్ జిల్లాలోని యాపిల్ తోటలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. యాపిల్ తోటలో పనిచేస్తున్న సునీల్ కుమార్ అనే కశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ సోదరుడు పింటూ కుమార్ గాయపడ్డాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జరిగిన తిరంగా ర్యాలీలలో ప్రజలను ప్రోత్సహించినందుకు.. కశ్మీరి పండిట్లను లక్ష్యంగా చేసుకున్నామని.. ‘కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్’ అప్పట్లో ప్రకటించుకుంది.
కశ్మీరీ పండిట్లకు కేంద్ర ప్రభుత్వం పునరావాసం కల్పించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాంటి టార్గెటెడ్ కల్లింగ్స్ జరుగుతున్నాయి. పండిట్లు తిరిగి కశ్మీర్ కు వస్తుండటాన్ని ఉగ్రమూకలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వరుసగా హిందువులను, పండిట్లను, వలస కూలీలు, స్థానికేతరులను టార్గెట్ గా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నాయి. ఇలా కొత్తరకం హైబ్రీడ్ టెర్రరిజానికి తెరతీశాయి.
గత మేనెలలో బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో అతి దగ్గర నుంచి ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాహుల్ అక్కడ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాహుల్.. ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. ప్రధాన మంత్రి ప్యాకేజి పథకంలో భాగంగా చదూర తహశీల్దారు కార్యాలయంలో రాహుల్ గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆయనపై గురువారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బుద్గాంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను శ్రీనగర్‌లోని మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేక పోయారు.
ఈ ఘటనపై అప్పట్లో కశ్మీరీ హిందువులు అంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత అమ్రీన్ భట్ అనే టీవీ నటిని కూడా కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఆ తరువాత ఓ హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరుడైన బ్యాంకు మేనేజర్‌తో పాటు బీహార్ వలస కూలీలపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు టెర్రరిస్టులు. గతేడాది అక్టోబర్ నెలలో ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. ఇందులో ఓ కాశ్మీరీ పండిట్ ఉండగా.. ఓ సిక్కు, ఇద్దరు వలస హిందువులు ఉన్నారు.
ఇదిలావుంటే, కొందరు ప్రభుత్వ ఉద్యోగులే కశ్మీర్ పండిట్ల సమాచారాన్ని ఉగ్రవాదులకు అందిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల అణిచివేతలో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించింది ప్రభుత్వం. వీరందరిని విధుల నుంచి తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని నిబంధనలు 311(2)సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసుల నుంచి తొలిగించారు. ఉగ్రవాదులతో సంబంధాలు, నార్కో-టెర్రర్ సిండికేట్లను నడుపుతున్నందుకు, ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు నిషేధిత సంస్థలకు సహాయం చేసినందుకు ఈ ఐదుగురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు గత ప్రభుత్వాల సహాయంతో వీరంతా డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇలాంటి అనేక టెర్రరిస్టు సానుభూతిపరులు.. ప్రభుత్వ వ్యవస్థలో తిష్ట వేశారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వారిలో తన్వీర్ సలీమ్ దార్ అనే కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.
1991లో విధుల్లో చేరిన తన్వీర్ జూలై 2002లో బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌లో ‘ఆర్మర్’ పోస్టులో చేరాడు. అతడు ఉగ్రవాదుల ఆయుధాలను రిపేర్ చేయడంతో పాటు మందుగుండు సామాగ్రిని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నట్లు తేలింది. శ్రీనగర్‌లోని లష్కరే తోయిబా అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద కమాండర్, లాజిస్టిక్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. తన్వీర్ శ్రీనగర్‌లో జరిగిన వరస ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఎమ్మెల్సీ జానైద్ షల్లా హత్యలో కీలకపాత్ర పోషించాడని తరుపరి విచారణలో తేలింది.
మరో ఉద్యోగి అఫాక్ అహ్మద్ వనీ బారాముల్లా జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇఫ్తికార్ ఆంద్రాబీ ప్లాంటేషన్ సూపర్ వైజర్ గా, ఇర్షాద్ అహ్మద్ ఖాన్ 2010లో జల్ శక్తి డిపార్ట్మెంట్ అర్డర్లీగా నియమితమయ్యాడు. అబ్దుల్ మోమిన్ పీర్ 2014లో పీహెచ్ఈ సబ్ డివిజన్ అసిస్టెంట్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. వీరందరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించడంతో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు.