More

  చిన్న దీవి.. పెద్ద కుతంత్రం..! లక్షదీవుల్లో అసలేం జరుగుతోంది..?

  ఉపద్రవం ఎటునుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఉగ్రమూకలు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు. ఉగ్రవాదులు దాడికి దిగితే ఇళ్లు, ఆస్తులు, ఊళ్లను వదిలి.. పిల్లా పాపలతో పరుగు తీయాల్సిందే. లేదంటే కత్తికో కండగా బలికావాల్సిందే. ఇదీ మూడు దశాబ్దాల క్రితం జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్ల దీనస్థితి. ముఖ్యంగా 1990 ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత మతోన్మాద ఉగ్రమూకలు సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. ఏకే-47లు, తుపాకులు, కత్తులతో వీధుల్లో స్వైర విహారం చేశారు. అడ్డం వచ్చిన హిందువులను నరికేశారు. మహిళలపై అత్యాచారాలూ జరిగాయి. హిందువుల దుకాణాలు, ఇతర ఆస్తిపాస్తులు ధ్వంసం చేశారు. కొన్ని ఆలయాలనూ నేలమట్టం చేశారు. స్కూళ్లు, ఆఫీసులు.. ఒకటేమిటి.. హిందువుల ముద్ర ఉన్న ప్రతీ ఒక్కటి తుడిచేశారు. మతోన్మాదుల ఉన్మాదానికి భయపడి.. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్లు ఇతర ప్రాంతాలకు పారిపోయివుంటారని అంచనా. 1990-2010 మధ్య దాదాపు 1341 మంది పండిట్లను ఊచకోత కోశారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పాలకులు చేసిన తప్పిదాలతో కశ్మీర్ ఇప్పటికీ రగిలిపోతూనేవుంది. అందుకే, ఉగ్రమూకలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్టికల్ 370ని రద్దుచేసింది మోదీ ప్రభుత్వం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మన దేశంలో మరో ప్రాంతాన్ని కశ్మీర్ లా మార్చే కుట్ర జరుగుతోంది. అదే కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. ఆ కుట్రను అడ్డుకునేందుకే మోదీ ప్రభుత్వం లక్షదీవుల్లో కొత్త సంస్కరణలు చేపట్టేందుకు నడుం బిగించింది.

  టూరిస్ట్ డెస్టినేషన్ లక్షదీవులు కొద్దిరోజులుగా వార్తల్లో నానుతున్నాయి. లక్షదీవుల పాలనాధికారి ప్రఫుల్ కె. పటేల్ ఇటీవల కొన్ని సంస్కరణలను ప్రతిపాదించారు. నివాసితుల భద్రత, శ్రేయస్సుతో పాటు.. మాల్దీవుల్లాగా లక్షదీవులను కూడా టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చేందుకు కొన్ని విధానాలను రూపొందించారు. ఇందులో భాగంగా.. ‘లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021’ ముసాయిదాను తయారుచేశారు. గోవధ నిషేధం, యాంటీ గూండా యాక్ట్, స్థానిక ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న వంటి పలు ప్రతిపాదనలున్నాయి. ఇక, మద్యపాన నిషేధం కొనసాగుతున్నప్పటికీ.. దీవుల్లో పర్యాటకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా రెస్టారెంట్లకు మాత్రం అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం బంగారం దీవిలో మాత్రమే పర్యాటకులకు మద్యం విక్రయించే వెసులుబాటు వుంది.

  కొత్త ముసాయిదాలో మరికొన్ని నిబంధనలు కూడా చేర్చారు. అభివృద్ధిలో భాగంగా.. దీవుల్లోని ఏదైనా ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటర్ ప్లానింగ్ ఏరియాగా ప్రకటించవచ్చు. అలాగే, ప్రజావసరాల కోసం ఏదైనా భూమిని సేకరించే హక్కు కూడా అడ్మినిస్ట్రేటర్ కు వుంటుంది. 2013 భూసేకరణ చట్టంలోని ‘రైట్ టు ఫెయిర్ కంపెన్షేషన్ అండ్ ట్రాన్స్ ఫరెన్సీ’ కింద ఈ అధికారాన్ని కట్టబెట్టారు. లక్షద్వీప్ దీవులను ఇతర రాష్ట్రాల మాదిరిగా అభివృద్ధి చేసి.. పర్యాటక ఆదాయాన్ని పెంచే సదుద్దేశంతోనే పాలనాధికారి ప్రఫుల్ కె. పటేల్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. కానీ, మనకు తెలిసిందే కదా..! మనదేశంలో ఏదైనా మంచి పనికి పూనుకుంటే స్వాగతించేవాళ్లకంటే విరోధించేవాళ్లే ఎక్కువగా వుంటారు. ప్రఫుల్ పటేల్ నిబంధనలను తప్పుబడుతూ.. స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించేందుకు.. విపక్షాలు క్రూరమైన, అశాస్త్రీయమైన, అసమంజసమైన వాదనలు తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా మోదీ వ్యతిరేకులు ఈ విషయంలో ముందు వరుసలో నిలబడి.. ప్రఫుల్ పటేల్ ను టార్గెట్ చేస్తున్నారు. కొత్త నిబంధనలతో పర్యావరణం దెబ్బతింటుందని.. జీవనోపాధి కరువవుతుందని కొత్త కొత్త వాదనలను తెరపైకి తెచ్చి.. స్థానికుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇంకొంతమంది అసమ్మతివాదులైతే ఏకంగా మతం రంగు పులుముతున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా వుంది కాబట్టే.. మోదీ ప్రభుత్వం వారిపై వ్యతిరేక నిబంధనలను రుద్దుతోందని ఆరోపిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ కోటరీ.. ప్రఫుల్ పటేల్ ప్రతిపాదించిన పాలనా సంస్కరణలకు వ్యతిరేకంగా ట్వీట్లతో విరుచుకుపడుతోంది.

  రాజకీయ వ్యతిరేకులే కాదు.. కుహనా లౌకిక జర్నిలిస్టులు కూడా,, ప్రశాంతంగా వున్న లక్షదీవుల్లో చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారు. లక్షదీవుల్లోని ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసేలా.. అల్ జజీరాలో సీనియర్ జర్నలిస్ట్ రానా ఆయూబ్ ఓ కథనాన్ని వండివార్చారు. ప్రింట్ వ్యవస్థాపకుడు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు శేఖర్ గుప్తా.. ఇంకాస్త ముందుకెళ్లి ప్రఫుల్ పటేల్ ప్రతిపాదనలు లక్షదీవుల అభివృద్ధికి గొడ్డలి పెట్టు అంటూ విమర్శించారు. మైనార్టీలను మాత్రమే సంతృప్తిపరచడంలో మాత్రమే ముందుండే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఓ మెట్టు పైకెక్కి ట్విటర్ లో ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపాదిత సంస్కరణలు.. 97 శాతం ముస్లిం జనాభాతో కూడిన లక్షద్వీప్ ప్రజలకు హానికరమని అన్నారు. ఇక, కేరళలోని పినరయి ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి.. లక్షదీవులకు ఎంతో అవసరమైన సంస్కరణలను హరించే ప్రయత్నం చేసింది. లక్షదీవుల పాలనాధికారి ప్రఫుల్ పటేల్ ను తొలగించాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంతేకాదు, లక్షదీవుల్లో కేంద్రం కాషాయ, కార్పొరేట్ ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఎరుపునీతిని ప్రదర్శించారు పినరయి విజయన్.

  ఇలా ముస్లింలలో భయాందోళనలు రేకెత్తించడం, మోదీ విరోధులకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతి విషయంలోనూ ఇలాగే అడ్డుపడ్డారు. అయోధ్య రామ మందిరం విషయంలో ఇలాగే విమర్శించారు. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. మోదీ మైనార్టీ వ్యతిరేక నిర్ణయాలు అమలు చేస్తున్నారని నానా రభస చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించినప్పుడు కూడా వ్యతిరేక ప్రచారం చేశారు. ఇది ముస్లింలపై కక్ష సాధింపు చర్య అంటూ ఆరోపణలు గుప్పించారు. సీఏఏ బిల్లు.. 2014 డిసెంబర్ కంటే ముందు మనదేశంలోకి వచ్చిన మూడు పొరుగుదేశాల మైనార్టీలకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది తప్ప.. ముస్లింలకు ఈ చట్టం ఎలాంటి హాని చేయదు. కానీ, ముస్లింల హక్కులు కాలరాస్తుందంటూ కొన్ని కుహనా శక్తులు పనిగట్టుకుని ప్రచారం చేశాయి.

  ఇక ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తున్న ట్రిపుల్ తలాక్‎ను రద్దు చేసినప్పుడు కూడా మోదీ వ్యతిరేకులు ఇలాగే తప్పుడు ప్రచారం చేశారు. మైనార్టీ వర్గాలకు ఏదో జరిగిపోతుందన్నట్టు లెఫ్ట లిబరల్ జర్నలిస్టులు పుంఖానుపుంఖాలుగా కాలమ్స్ రాసిపారేశారు. ముస్లిం పర్సనల్ లాకు సంబంధించిన విషయంలో మోదీ ఎలా కల్పించుకుంటారంటూ రాద్దాంతం చేశారు. ట్రిపుల్ తలాక్ తో ముస్లిం మహిళలు దారుణ పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నా.. వారి బాధలు పట్టించుకోకుండా అవాకులూ చెవాకులూ పేలారు. ముస్లిం సమాజంలో సంస్కరణలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ మోదీపై విషం కక్కుతూనేవున్నారు. ఇక, కుహనా లౌకికవాద లెఫ్ట్, లిబరల్ జర్నలిస్టు మేధావులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలకు అంటకాగుతూ వ్యతిరేక కథనాలు వండి వార్చారు. తద్వారా ముస్లిం అనేవాడు నిరంతరం భయపడుతూ వుంటాడని.. బీజేపీ వైపు, మోదీ వైపు ఆకర్షితుడు కాకుండా వుంటాడని పగటి కలలు కంటున్నారు. తాజాగా వాళ్ల కళ్లన్నీ లక్షదీవులపైన పడ్డాయి. పాలనాధికారి ప్రఫుల్ పటేల్ ప్రతిపాదించిన సంస్కరణలపైనా ఇలాగే దుష్ప్రచారం మొదలుపెట్టా. ప్రతిపక్ష పార్టీలు, వారి మద్దతుదారులు విసిరే ఎంగిలాకులకు ఆశపడిన కొందరు పెంపుడు జర్నలిస్టులు తమ పైత్యాన్నంతా ప్రదర్శిస్తున్నారు. ఒక వ్యక్తి ఇస్టానికో, లేదా ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికో ఈ దేశంలో చట్టాలు చేయరు. అయితే, కేంద్రం సదుద్దేశంతో చేసిన పథకాలను.. జర్నలిస్టుల ముసుగులో వున్న కొందరు కుహనామేధావులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనేవుంటారు. దీనికి అనేక కారణాలున్నాయి.

  నిజం చెప్పాలంటే.. లక్షదీవులు కేవలం ఓ టూరిస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతానికి భౌగోళికంగా గానీ, చారిత్రకంగా కానీ ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అందుకే, ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో వుంది. ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదుగానీ.. ప్రమాదాలు మాత్రం పొంచివున్నాయి. ఓవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరోవైపు ఇతర శత్రు దేశాలు, ఇంకోవైపు సముద్ర దొంగలు, విచ్చలవిడిగా చెలరేగిపోతున్న డ్రగ్ మాఫియా. ఇలా పలు రూపాల్లో ప్రమాదాలు ఎప్పుడూ వెన్నంటే వుంటున్నాయి. వీటిని దృష్టిలో వుంచుకుని.. భద్రతాకోణంలో ఆలోచించి మాత్రమే కేంద్రం ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటర్ కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. ఈ నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావు. ఎంతో ముందుచూపుతో ఆలోచించి, విస్తృతమైన చర్యలు జరిపిన తర్వాత.. ద్వీపాల అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం కోసం ఉత్తమ ప్రయోజనాల కోసం నిబంధనలకు రూపకల్పన చేశారు. పైగా ఇలాంటి సంస్కరణలు చేయడానికి అడ్మినిస్ట్రేటర్ కు పూర్తి రాజ్యాంగబద్ధమైన అధికారం వుంది. కేవలం దీవుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ప్రఫుల్ కె. పటేల్ కొత్త నిబంధనలను రూపొందించారు. ఇవి స్వప్రయోజనాల కోసమే, ఓ వర్గాన్ని సంతృప్తిపరచడం కోసమో తీసుకున్న నిర్ణయాలు అనుకుంటే, అంతకన్నా పొరపాటు మరొకటి వుండదు.

  అయినా, ఓ కొత్త చట్టాన్ని రూపొందించాలన్నా.. కొత్త సంస్కరణలను చేపట్టాలన్నా ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుందో.. లక్షదీవుల సంస్కరణలను వ్యతిరేకిస్తున్న మేధావులకు తెలయని విషయం కాదు. సంస్కరణలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలు, ప్రత్యేకతలు ఇలా ప్రతి అంశంపై వారికి అవగాహన వుంటుంది. అయినప్పటికీ, ప్రతిపాదించిన సంస్కరణలు న్యాయమైనవి, సముచితమైనవి అయినప్పటికీ.. వ్యతిరేకించడమే ఎజెండాగా పెట్టుకుంటారు. ఎందుకంటే, విపక్షాల సైద్ధాంతిక సంకెళ్లలో వారంతా ఎప్పుడూ నిర్బంధించబడి వుంటారు. అందుకే, మోదీని, మోదీ చేసే పనిని వ్యతిరేకించడమే వారి లక్ష్యం.

  కొన్నేళ్లుగా మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేస్తున్నప్పటికీ వారికి ప్రయోజనం దక్కడం లేదు. ఎన్నోసార్లుు ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై ముస్లిం వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. సాధారణంగా ఎప్పుడూ వైఫల్యాలే ఎదురవుతుండటం వల్ల కూడా తీవ్రమైన ఆలోచనలు కలుగుతాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఇప్పుడు విపక్షాలు, వారి కబంద హస్తాల్లో చిక్కున్న మీడియా కోటరీ ఇలాగే తీవ్రమైన ఆలోచనలు చేస్తోంది.ఇందులో భాగంగానే వారు లక్షదీవులను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. అయితే, వాళ్ల పాచిక పారుతుందో లేదో గానీ.. ముస్లింలను పావుగా వాడుకుని లబ్దిపొందాలన్న వారి దుర్నీతి మాత్రం.. ఈ ఘటనతో మరోసారి తేటతెల్లమైంది.

  లక్షదీవుల్లో ప్రతిపాదించిన సంస్కరణలను.. మోదీ, అమిత్ షా, బీజేపీని టార్గెట్ చేయడం కోసమే విపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి తప్ప.. అసలు సంస్కరణలను లోతుగా పరిశీలించడానికి మాత్రం ఆసక్తి కనబరచడం లేదు. మైనార్టీలను ఓటుబ్యాంకుగా చూడటం, బీజేపీకి వారిని దూరం చేయడమే విపక్షాల లక్ష్యం తప్ప.. అసలు నిజంగా సంస్కరణల్లో ఏముంది..? వీటివల్ల ఉపయోగం ఎంత..? దేశ భద్రతకు ఇవి అవసరామా..? అని విశ్లేషించుకున్న పాపానపోలేదు.

  లక్షదీవుల్లోని మొత్తం 36 దీవుల్లో కేవలం 10 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. మిగతావి జనావాసాలు కావు. అలాంటప్పుడు, కేవలం 10 దీవులకు సంబంధించి మాత్రమే సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, అది పర్యావరణ విపత్తు ఎలా అవుతుంది..? మార్పు అనేది జీవితంలో సహజమైన ప్రక్రియ. అదే జీవితాన్ని నడిపిస్తుంది. స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి అధికారం వెలగబెట్టిన ప్రభుత్వాలు.. వాళ్లకు అనుకూలమైన, పనికొచ్చే సంస్కరణలు చేసుకున్నాయి. మార్పులు, చేర్పులు చేయకపోవడానికి, వాళ్లు చేసిన సంస్కరణలు, చట్టాలు రాచరిక శాసనాలేం కాదు. మార్చలేనంత పవిత్రమైనవి కూడా కాదు. రాష్ట్రాలు, లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు, సంస్కరణల్లో మార్పులు చేసే హక్కు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఉంటుంది. ఇది రాజ్యాంగం కల్పించిన అధికారం. అయినా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంస్కరణలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. తాజా సంస్కరణలతో ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపే వెసులుబాటు లభిస్తుంది. సముద్ర దొంగలు, డ్రగ్ మాఫియా ఆట కట్టించవచ్చు. టూరిస్ట్ స్వర్గధామమైన లక్షదీవుల్లోని రిసార్టుల్లో మద్యం అమ్మకాలకు అనుమతి లభిస్తుంది. అయితే, కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ విశేషమేటంటే, 2019 అక్టోబర్ గణాంకాల ప్రకారం.. అత్యధిక తలసరి ఆల్కహాల్ వినియోగంలో వున్న రాష్ట్రం కేరళ మాత్రమే. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యాన్ని విక్రయిస్తున్న.. కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్.. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు. కానీ, అదే కేరళ ప్రభుత్వం.. తమకు భౌగోళిక సామీప్యత కలిగిన లక్షదీవుల్లో మాత్రం.. కొత్త సంస్కరణలను వ్యతిరేకిస్తోంది. ఇది విడ్డూరం కాక మరేమిటి..?

  లక్షదీవుల సంస్కరణలపై విపక్షాల అభ్యంతరాలు చూస్తుంటే.. నాడు కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అంశం గుర్తుకొస్తోంది. నేడు ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారే.. అప్పుడు ర్యాలీలుతీశారు.. ఆందోళనలు నిర్వహించారు. కానీ, చివరికి ఏం జరిగింది..? ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారత్‎తో విడదీయరాని భూభాగంగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ భారతీయులెవరైనా భూములు కొనుగోలు చేయవచ్చు. నివాసాలు ఏర్పరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. నాడు, విపక్షాలకు భయపడి ఆర్టికల్ 370 రద్దుకు వెనకడుగు వేస్తే.. ఉగ్రమూకల నుంచి కశ్మీర్ కు ఉపశమనం లభించేదా..? లక్షదీవుల్లో కొత్త సంస్కరణలను వ్యతిరేకించడానికి విపక్షాలు చూపుతున్న సాకు ముస్లిం మేజారిటీ ప్రాంతం. ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ ఇదే సాకు చూపించారు. అయితే, ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ముస్లింలకు ఎలాంటి హాని జరగలేదు. ఈ నూతన సంస్కరణలతో లక్షదీవుల్లో కూడా ముస్లిం వర్గాలకు ఎలాంటి హాని జరగదు గాక జరగదు. దీనిని బట్టి, కేవలం మోదీ టార్గెట్ గానే విపక్షాలు ఈ కుట్ర చేస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో అయోధ్య, ట్రిపుల్ తలాక్ విషయంలోనూ విపక్షాలు రాద్దాంతం చేసాయి. అయినా, ఆ చట్టాలు అమల్లోకి రాకుండా ఆగిపోలేదు కదా..! దీనినిబట్టి.. జాతి ప్రయోజనాల కోసం నిర్దేశించిన చట్టాలు, సంస్కరణలు, నిర్ణయాలు ఏవైనా.. అమలు చేయడానికి మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని అర్థమవుతోంది. ఇప్పుడు లక్షదీవుల విషయంలోనూ కొత్త సంస్కరణలు అమల్లోకి తీసకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

  Trending Stories

  Related Stories