దేశంలో కుప్పకూలిన మరో కాంగ్రెస్ ప్రభుత్వం..!

0
783

దేశంలో మరోచోట కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలింది. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో కాంగ్రెస్ పార్టీ.. పుద్దుచ్చేరిలోనూ అధికారాన్ని కోల్పోయింది. బలపరీక్షలో విఫలమైన సీఎం నారాయణస్వామి.. తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం పుదుచ్చేరి తాత్కాలిక లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు.

సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఇచ్చిన ఆదేశాలతో అసెంబ్లీని సమావేశపరిచారు. ఈ సందర్భంగా సీఎం నారాయణసామి మాట్లాడుతూ.. తనకు మెజార్టీ ఉందని, విశ్వాస పరీక్షలో నెగ్గుతామని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, డీఎంకే నేత స్టాలిన్ కారణంగా ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలు గురించి సీఎం సభలో ప్రస్తావించారు. తనకు మద్దతుగా సభ్యులు ఓటేయాలని సీఎం కోరారు. అయితే, బలపరీక్షలో సీఎం నారాయణస్వామి నెగ్గుకురాలేకపోయారు. దీంతో నాలున్నరేళ్ల కాంగ్రెస్-డీఎంకే సర్కారు కుప్పుకూలింది.

ఇటీవల ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో పడిన కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం.. ఊహించినట్టుగానే విశ్వాసపరీక్షలో ఓడిపోయింది. పుదుచ్చేరి మూడు నామినేటెడ్ సీట్లు కలుపుకుని.. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 33. ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత.. అసెంబ్లీలో సీట్ల సంఖ్య 26కు పడిపోయింది. అధికారానికి కావాల్సిన సాధారణ మెజారిటీ 14. కానీ, ప్రస్తుతం అధికార పక్షంలో కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ కు 9, డీఎంకే 2, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయినా కాంగ్రెస్-డీఎంకే కూటమి బలపరీక్షలో విఫలమైంది.

అటు ప్రతిపక్షాలకు సరిగ్గా సాధారణ మెజారిటీకి సరిపడా సభ్యులున్నారు. విపక్ష కూటమిలోని 14 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఆల్ ఇండియా N.R.కాంగ్రెస్ కు ఏడుగురు, అన్నా డీఎంకేకు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలున్నారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఎన్.ఆర్. కాంగ్రెస్ కూటమికి అవకాశం ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆమె ముందు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తోన్నాయి. ఒకటి- ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించడం.. రెండు- రాష్ట్రపతి పాలన విధించడానికి సిఫారసు చేయడం.. మూడు- అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం. ఈ మూడింట్లో తొలి ఆప్షన్‌కే అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. మరో ఒకట్రెండు నెలల్లో పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నందున.. రాష్ట్రపతి పాలన, లేదా అసెంబ్లీ రద్దు ఆప్షన్లను కూడా పరిశీలనలోకి తీసుకునే అవకాశ వున్నట్టు తెలుస్తోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here