More

    తమిళనాడులో బీజేపీ నేత కుటుంబం దారుణ హత్య..!

    తమిళనాడులో భారతీయ జనతా పార్టీ నేతలు, వారి కుటుంబాలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత కుటుంబాన్ని కొంతమంది దుండగులు హత్య చేశారు. తమిళనాడులోని తిరుప్పూరులో దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మహిళలను కూడా చంపేశారు. సెంథిల్ అనే 47 సంవత్సరాల వ్యక్తి పల్లాడం దగ్గరలోని కళ్లికనారు వద్ద హోల్ సేల్ రైస్ షాపును నడుపుతున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొంతమంది వాళ్లకు చెందిన స్థలం దగ్గరా మద్యం తాగారు. ఇది మా స్థలం.. ఇక్కడ మందు తాగకండి.. ఇంకెక్కడికైనా వెళ్లి తాగండి అని సెంథిల్ చెప్పాడు. దీంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సెంథిల్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆయనను కాపాడటానికి వచ్చారు. వారిపై కూడా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో సెంథిల్ తో పాటు ఆయన సోదరుడు మోహన్ రాజ్, వారి తల్లి, అత్తయ్య గాయపడ్డారు.

    సెంథిల్ సోదరుడు మోహన్ రాజ్ బీజేపీ కార్యకర్త. ఆయన పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వచ్చినప్పుడు ఆయన సభను సక్సెస్ చేసిన వారిలో మోహన్ రాజ్ ఉన్నారు. దుండగులు చేసిన దాడిలో నలుగురు కుటుంబ సభ్యులు మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యలకు కారణం కేవలం మద్యం మత్తులో ఉన్న వారితో గొడవేనా లేక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనే కోణం పోలీసులు విచారణ చేపట్టారు.

    ఈ ఘటనపై అన్నామలై స్టాలిన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోహన్‌రాజ్‌తో పాటు అతని తమ్ముడు, తల్లి, అత్తను దారుణంగా నరికి చంపడం బాధాకరమని.. దిగ్భ్రాంతికరమని అన్నారు. మోహన్‌రాజ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి చెబుతున్నానని అన్నారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో ఇంకా ఎంతమంది పౌరులు చనిపోవాలని ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వ మద్యం వ్యాపారులు ప్రతి వీధిలో మద్యం దుకాణాలను తెరిచి, ఇష్టానుసారం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ బాగా డబ్బు సంపాదిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనను తాను “నంబర్ వన్ సిఎం”గా చెప్పుకుంటూ ఉన్నారని అన్నామలై దుయ్యబట్టారు. తమిళనాడులో ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నప్పుడు, శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నపుడు, తానే నెంబర్‌వన్‌ ముఖ్యమంత్రి అని ప్రకటించుకోవడానికి ముఖ్యమంత్రికి సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

    Related Stories