మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొత్తుల చర్చ ఎక్కువ జరుగుతున్న సంగతి తెలిసిందే..! టీడీపీ-జనసేన మరోసారి ఒకటై పోటీ చేస్తాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. వీటిపై అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో.. ఎవరిని పెళ్లి చేసుకుంటారో.. మాకు అనవసరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి వాళ్ళకి భయం పట్టుకుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
వాళ్ల మీద వాళ్ళకి వ్యక్తిగతంగా నమ్మకం లేక అందరూ ఒకటవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నారో వారి చర్యలను చూస్తుంటే అర్థం అవుతోందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అనారోగ్య సమస్యల వల్ల ఇంకా గడపగడపకు ఎమ్మెల్యే ప్రోగ్రాం ని మొదలు పెట్టలేదని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. రెండున్నర ఏళ్ల క్రితం NRC ఇష్యూ సందర్భంగా జరిగిన పాత వీడియోను తీసుకొచ్చి గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో అనిల్ ను ముస్లింలు తరిమికొట్టారని టీడీపీ-జనసేనలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీకి తొత్తు జనసేన అని.. జనసేన తో కలవాలనుకుంటోంది టీడీపీ. ఈ మూడు ఒక కూటమి అని అన్నారు. ఈ కూటమి ముస్లింల నుంచి వైసీపీ ని వేరు చేయాలని చూస్తోందని అన్నారు. ఇంకో జన్మ ఎత్తినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడని.. 75 ఏళ్ళ వయసులో వచ్చి చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.