మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటూ ఉంది. అనిల్ దేశ్‌ముఖ్‌కు చెందిన రూ.4.20 కోట్ల విలువైన చిరాస్థులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు అనిల్ దేశ్‌ముఖ్ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులను హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జప్తు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో జప్తు చేసిన ఆస్తుల విలువు సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చిన అభిప్రాయపడుతున్నారు. నేవీ ముంబైలో ప్రతిపాదిత విమానాశ్రయానికి సమీపంలో ఒక ఫ్లాట్, భారీ మొత్తంలో ఇండ్ల స్థలం అనిల్ దేశ్‌ముఖ్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయి. వీటి విలువ రూ.4 కోట్లు మార్కెట్ విలువ రూ.100 కోట్ల పైనే ఉంటాయని ఈడీ వర్గాలు తెలిపాయి. అనిల్ దేశ్‌ముఖ్ భార్య ఆరతి దేశ్‌ముఖ్, ప్రీమియర్ పోర్ట్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గల ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ (రూ.1.54 కోట్లు), ఇంకా రూ.2.67 కోట్ల విలువైన 25 ఇండ్ల స్థలాలను కూడా జప్తు చేశారు.
అనిల్ దేశ్‌ముఖ్ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ ఆరోపణలు మేరకు అనిల్ దేశ్‌ముఖ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.100 కోట్ల మేరకు ముడుపులు వసూళ్లు చేశారని మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలు చేశారు. అక్రమ సొమ్ము శ్రీ సాయి శిక్షణ సంస్థ పేరుతో ఉన్న ట్రస్టుకు వచ్చిన నిధులుగా దేశ్‌ముఖ్ కుటుంబ సభ్యులు చూపిస్తున్నట్టు ఈడీ అంటోంది. ఈ కేసులో అనిల్ దేశ్‌ముఖ్ ప్రైవేటు కార్యదర్శి సంజీవ్ పలాండే, ప్రైవేట్ అసిస్టెట్ కుందన్ షిండేలను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణకు సంబంధించి ఓవైపు సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఆయన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. కొద్ది రోజుల కిందటే అనిల్ దేశ్‌ముఖ్ చాలా కష్టం మీద తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈడీ అన్యాయంగా అనిల్‌పై కేసు నమోదు చేసిందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.