ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో కూడా పెట్రోలు, డీజిల్ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ధరలు తగ్గించాయి.
ఇక తెలుగు రాష్ట్రాలు కూడా ధరలు తగ్గించాలనే డిమాండ్ బాగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కనీసం రూ.16 తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 9న అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపడతామని.. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఈ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పెట్రోలు ధరలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అధికారంలోకి వస్తే పెట్రోలు రేట్లు తగ్గిస్తామని జగన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించిన తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు పెట్రోలు ధరలు తగ్గించాయని, ఏపీలో మాత్రం తగ్గించలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెట్రోలు ధరలపై జగన్ ఆందోళన చేశారని.. అధికారం చేతిలో ఉందని జగన్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
నరసాపురం ఎంపీ రఘురామరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిలుపుతో చాలా రాష్ట్రాలు పెట్రో పన్నులను తగ్గించాయని అన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువ రఘురామ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి సీఎం జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని రఘురామ సూచించారు.
పెట్రోల్ ,డీజిల్ ధరల తగ్గింపుపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది. తెలంగాణలో పెట్రోల్ పై 35.2శాతం వ్యాట్, డీజిల్ పై 27శాతం వ్యాట్ ఉంది. వీటిని తగ్గించాల్సిందేననే డిమాండ్ మొదలైంది. ఈ మేరకు పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎంతమేరకు తగ్గించవచ్చనే అంశంపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన రీతిలోనే రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంత తగ్గింపు ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.