Telugu States

ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం మంది ప్రజాప్రతినిధులు ముర్ముకే ఓటు

ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం మంది ప్రజాప్రతినిధులు ద్రౌపది ముర్ముకే ఓటేశారు. చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్‌, సిక్కింలలో మాత్రమే బీజేపీ వంద శాతం ఓట్లు దక్కించుకుంది. తెలంగాణ, కేరళ, పంజాబ్‌, ఢిల్లీల్లో ప్రధాన పార్టీలు రెండూ ముర్ముకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్డీయేకు అతి తక్కువ ఓట్లు దక్కాయి.

మొత్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,809 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,824 మంది ముర్ముకు ఓటు వేయగా.. 1877 మంది యశ్వంత్ సిన్హాకు ఓటు వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,72,377. ఇందులో ముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 6,76,803.. ఇక యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 3,80,177గా ఉంది. మొత్తం పోలైన ఓట్ల విలువలో ద్రౌపది ముర్ము 64.04శాతం సాధించగా.. యశ్వంత్ సిన్హా 35.97 శాతంతో సరిపెట్టుకున్నారు.

మరో వైపు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే ద‌న‌సిరి అన‌సూయ అలియాస్ సీత‌క్క ఓటు చెల్లుబాటు కాలేదు. గురువారం జ‌రిగిన ఓట్ల లెక్కింపులో సీతక్క ఓటును చెల్ల‌ని ఓటుగా ప‌రిగ‌ణించిన అధికారులు… దానిని ప‌క్క‌న ప‌డేశారు. పోలింగ్ రోజున త‌న‌కు ఇచ్చిన బ్యాలెట్ పేప‌ర్‌పై పొర‌పాటున సిరా ప‌డింద‌ని, వేరే బ్యాలెట్ ప‌త్రం ఇవ్వాల‌ని సీత‌క్క ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు. అయితే ఆమెకు మ‌రో బ్యాలెట్ పేప‌ర్ ఇచ్చేందుకు అధికారులు నిరాక‌రించారు. ఈ క్ర‌మంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో సిరా గీత‌లు ప‌డిన బ్యాలెట్ పేప‌ర్‌తోనే ఓటు వేసిన‌ట్లు సీత‌క్క తెలిపారు.

Related Articles

Back to top button