More

    ఏపీలో ‘ఇప్పటం’ పై రచ్చ.. ఎవరేమన్నారంటే..?

    మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చడంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇడుపులపాయపై హైవే వేస్తామంటూ హెచ్చరించారు. జనసేన సభను నిర్వహించుకోవడానికి స్థలం ఇచ్చారనే అక్కసుతోనే ఇళ్లను కూల్చేశారని మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలు, జనసైనికుల నినాదాల మధ్య ఆయన ఇప్పటానికి చేరుకున్నారు. పవన్ పర్యటనకు అనుమతి లేని కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం వెళ్లే దారి అడుగుడునా పోలీసులు మోహరించి ఉండడాన్ని పవన్ తప్పు పట్టారు. మధ్యలో పవన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పవన్ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరించటానికి ఇదేమన్నా కాకినాడ, రాజమండ్రిలాంటి టౌన్ ప్రాంతమా? రోడ్డపై గుంతలు పూడ్చలేరుగానీ రోడ్లు విస్తరిస్తారా? సామాన్యుల ఇళ్లు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేస్తారా? మేం ఇడుపుల పాయలో హైవే వేస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.

    పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కూల్చి పారదొబ్బడానికి ఇది సినిమా సెట్టింగు కాదు, షూటింగ్ కాదు పవన్ కల్యాణ్’ అని ట్వీట్ చేశారు.

    ఇప్పటం గ్రామంలో కూల్చివేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తోందని.. శిశుపాలుడిలా జగన్ రెడ్డివి వంద తప్పులు దాటాయని… ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్టుగా మార్చేశారని.. ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా? అంటూ నిలదీశారు. ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటేనో, చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

    Trending Stories

    Related Stories