ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏజీ దాఖలు చేసిన అఫిడవిట్ ను ఓవైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే హైకోర్టులో దాఖలు చేశారు. బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి కొత్త బిల్లును సీఎం జగన్ ప్రవేశపెట్టనున్నారు. మళ్లీ కొన్ని మార్పులతో కొత్తగా సభలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి రాజధానికి భూములిచ్చిన అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు.
ఏపీలోని వరద పరిస్థితులపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరికొన్ని కీలకమైన అంశాలపైనా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులు అందరూ హాజరుకానున్నారు. మిగిలిన మంత్రుల్లో కొందరు వరద సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తుండటంతో వారు వర్చువల్ ద్వారా సమావేశంలో పాల్గొనున్నారు.