More

    ఏపీలో పెట్రోల్-డీజిల్ రేట్లు తగ్గే అవకాశం లేనట్లే..!

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్-డీజిల్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న వాళ్లకు నిరాశ తప్పదు. ఎందుకంటే ఏపీలో పెట్రోల్-డీజిల్ రేట్లు మరింత తగ్గే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. అందుకు రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనం. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పన్నులు తగ్గించిన తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ముందుకు రాలేదు. ఇంధన ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనంతమాత్రంగానే ఉందని ఈ సమయంలో ధరలు తగ్గిస్తే రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందని రాజేంద్రనాథ్ అన్నారు. కేంద్రానికి ఉన్నన్ని ఆర్థిక వనరులు రాష్ట్రాలకు ఉండవని, కేంద్రం నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవడం కుదరదని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం చెప్పామని.. ప్రస్తుతానికి తాము వ్యాట్ తగ్గించలేమని బుగ్గన స్పష్టం చేశారు.

    ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశమంతా తగ్గించిందని, జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే తగ్గించలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు కేంద్రం దొంగచాటు చర్యలను గమనిస్తున్నాయన్నారు. పన్నులు విధిస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్ ల రూపంలో వసూలు చేస్తున్నారు. పన్నుల రాబడి పంపకం విధానంలో రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలి కాబట్టి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

    ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పెట్రో ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం సామాన్యుడి నడ్డి విరిచిందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఎక్కడా పెరగలేదని, క్రూడాయిల్ ధర ప్రకారమే అయితే లీటర్ పెట్రోల్ రూ.70 లోపే వస్తుందని అన్నారు. ప్రస్తుతం పెట్రో ధరలు తగ్గించడం రాష్ట్రాలకు సాధ్యపడదని సజ్జల స్పష్టం చేశారు. మేం తగ్గించాం… మీరు కూడా తగ్గించండి అంటూ రాష్ట్రాలపై పడితే తామేమీ చేయలేమని అన్నారు. పెట్రో ధరలపై టీడీపీ, బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

    Trending Stories

    Related Stories