More

    చంద్రబాబు 36 గంటల దీక్ష.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు

    ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ ఆఫీసులపై దాడులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ బంద్ చేపట్టింది. పోలీసులు మాజీ మంత్రులు, టీడీపీ పార్టీ సీనియర్ నేతలను ముందస్తుగానే గృహ నిర్బంధం చేశారు.

    అనంతపురం జిల్లా వెంకటపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురంలో ఆ పార్టీ నేత బీకే పార్థసారథిలను హౌస్ అరెస్ట్ చేశారు.చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ ను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నా చేశాయి. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పుంగనూరు, తిరుపతిలలో ఆందోళన చేపట్టిన పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తదితర నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరంలో పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఇంట్లోనే నేలపై కూర్చుని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిరసన తెలియజేశారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత‌ పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని ప‌లు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిర‌స‌న‌లు తెలిపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ నిర‌స‌న‌లు తెలుపుతోంది. కడప అంబేద్కర్‌ కూడలిలో, పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వ‌హించారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతపురం బుక్కరాయ సముద్రంలో టీడీపీ దిష్టిబొమ్మను వైసీపీ కార్య‌క‌ర్త‌లు దహనం చేశారు.

    టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులకు నిరసనగా 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు టీడీపీ ప్రకటన రిలీజ్‌ చేసింది. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద దాడులకు సీఎం జగన్‌ తెరతీశారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజమని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే టీడీపీ నేతలు ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేశారని, కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయేలా దాడులకు తెగబడ్డారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడి జరిగిన రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని చంద్రబాబు అన్నారు.

    టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ఆలపాటి రాజాను ఏ3గా, తెనాలి శ్రవణ్ ను ఏ4గా, పోతినేని శ్రీనివాసరావును ఏ5గా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

    Related Stories