ఏపీ సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్

0
763

పండగల సీజన్ లో పలు సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి. వాటికి కలెక్షన్లు రావాలంటే 100 శాతం సీటింగ్ తో సినిమాలను ప్రదర్శించాలి. ఈ విషయాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేశారు తెలుగు సినిమా పెద్దలు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలకు అనుమతి ఇచ్చారు. రోజుకు 4 ప్రదర్శనలపై ఆంక్షలు ఎత్తివేశారు. సీట్ల మధ్య ఖాళీలు వదలాలన్న నిబంధనను తొలగించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, నిర్మాణ సంస్థలు ఏపీ సీఎం జగన్ కు, మంత్రి పేర్ని నానిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంది. సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలు, 4 షోస్ కు అనుమతించడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ పునర్నిర్మాణం దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

తెలంగాణలో 100 శాతం ఆక్యెపెన్సీతో సినిమా ధియేటర్లు నడుస్తున్నాయి. ఇన్ని రోజులు ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తాజా మార్గదర్శకాలు గురువారం నుంచి ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్‌కే అనుమతి ఉండేది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు సడలిస్తూ ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో 250 మందికి అనుమతిచ్చింది.

ఇక వివాహాలు, ఇతర శుభకార్యాలు, ఫంక్షన్లు, సభలు, సమావేశాలు, సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు గరిష్ఠంగా 250 మంది వరకు హాజరు కావొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, తరచుగా శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. రాత్రి కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. అయితే సమయాలను కాస్త కుదించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.