More

  నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ

  మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఆయన నివాసంపై దుండగులు దాడి చేశారు. విజయవాడలోని పట్టాభి ఇంట్లోకి చొరబడిన దుండగులు అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. పట్టాభిరామ్ నివాసంపై దాడిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో దాడి జరిగిందని తెలిపారు. సుమారు 200 మంది వరకు తమ ఇంటిపైన దాడి చేశారని.. గట్టిగా కేకలు వేస్తూ సామగ్రి ధ్వంసం చేశారని, పట్టాభి దొరికితే చంపేస్తామని హెచ్చరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పలు జిల్లాల్లో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపైనా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.

  విజయవాడలో పట్టాభి నివాసంపై దాడి, మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ధ్వంసంతో పాటు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడి వంటి ఘటనల నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నేటి దాడిలో దెబ్బతిన్న వైనాన్ని చంద్రరబాబు స్వయంగా పరిశీలించారు. పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

  ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం నాడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. హెరాయిన్ గురించి మాట్లాడితే ఏమిటి తప్పు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి సాగు పెరిగిందని అనడమే టీడీపీ నేతలు చేసిన తప్పా అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. తమకు కూడా కోపం, ఆవేశం, బాధ, తపన ఉన్నాయని… అయితే నిగ్రహించుకుంటున్నామని అన్నారు. ఎన్ని బాధలున్నా నిగ్రహించుకుంటున్నాం. నా టెంపర్ మెంట్ లూజ్ చేసుకోవడానికి ఒక్క సెకను చాలు. నా ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పటి నుంచి ఈ అరాచకాలు ప్రారంభం అయ్యాయని చంద్రబాబు విమర్శించారు.

  తెలుగు దేశం పార్టీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఘటనలపై తీవ్రస్థాయిలో స్పందించారు. “ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించేవాడ్ని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ దందా చేస్తారు… ఆ విషయాలపై నిలదీసే టీడీపీ నేతలపై దాడులకు పాల్పడతావా?” అంటూ వరుస ట్వీట్లు చేశారు నారా లోకేష్.

  “నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని. మా కార్యకర్తలు నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం దాటేంత వరకు తరిమికొడతారు.. ఆనవాయితీలన్నింటిని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యానికి పాతరేసి, నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా!” అంటూ విరుచుకుపడ్డారు. “తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టీడీపీ కేంద్ర కార్యాలయంపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా?” అంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
  “నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన పనిలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంతో ఉన్న క్యాడర్ కు మా లీడర్ ఒక్క కనుసైగ చేస్తే చాలు” అంటూ చెప్పుకొచ్చారు నారా లోకేష్.

  Related Stories