క్షేత్ర స్థాయిలో బీజేపీ బలోపేతం.. రాష్ట్ర కమిటీలను ప్రకటించిన ఏపీ బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నాలను మొదలు పెట్టారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గ్రామాల్లోనూ, నగరాల్లోనూ బలోపేతం చేయాలంటే కమిటీలు ఎంతో ముఖ్యమైనవి. అందుకే ఆ విషయంపై దృష్టి పెట్టింది అధిష్టానం. ఎన్నో రోజులుగా భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న కార్యకర్తలకు ఏపీ బీజేపీలో సముచిత స్థానాలు లభిస్తూ ఉన్నాయి. ఏపీ బీజేపీ వివిధ విభాగాలకు సంబంధించి రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఓ ప్రకటనలో కమిటీల వివరాలు వెల్లడించారు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన ఆయన, ఆయా కమిటీలు, సభ్యుల జాబితాలను పంచుకున్నారు.
“ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, వివిధ విభాగాలకు సంబంధించిన రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలలో అవకాశం లభించిన కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. కమిటీల సభ్యులందరూ కూడా వారి బాధ్యతలకు తగిన న్యాయం చేస్తూ, పార్టీ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.