More

    ఓ వైపు నాయకుల మధ్య మాటల యుద్ధం.. ప్రాజెక్టుల వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసులు

    ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం చోటు చేసుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలోనూ, నదీ జలాల విషయంలోనూ తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుదుత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వివాదం నెలకొంది. ప్రాజెక్టులు సగమైనా నిండకుండానే సాగర్ లో విద్యుదుత్పత్తి చేయడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే కరెంట్ ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకుండా జలవిద్యుత్ ను తయారు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేని ఆరోపించారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పోలీసులను మోహరించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో వంద మందికి పైగా పోలీసులను మోహరించారు. ఇటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పరిధిలోనూ పోలీసు మోహరింపులు చోటు చేసుకున్నాయి. సాగర్ ప్రాజెక్టు వద్ద అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ ప్రభుత్వాలు పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నాయి.

    మరో వైపు ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణ పనులు పునర్విభజన చట్టానికి వ్యతిరేకమంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ సీఎస్‌ లేఖ రాయగా.. పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా డెల్టా నీటి అవసరాల కోసం 45.77 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం తెలంగాణ అధీనంలో ఉందని, ఇప్పుడీ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు నీటిని విడుదల చేయాలని ఎస్ఈ (విజయవాడ) ప్రతిపాదించినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేయాలన్నది నిబంధన అని, కానీ ఇప్పుడు ఆ నియమావళిని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కృష్ణా డెల్టాకు నీటి అవసరాలు లేకపోయినా పులిచింతల నుంచి నీటిని విడుదల చేస్తున్నారని, దీనివల్ల ప్రకాశం బ్యారేజీ ద్వారా ఆ నీరంతా వృథాగా సముద్రంలోకి చేరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఏపీ నిర్మిస్తున్న ఆర్డీఎస్ నిర్మాణం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని, వెంటనే వాటిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 నిర్ణయాన్ని కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదని, ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకపోయినా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని చేపట్టిందని ఆ లేఖలో ఆరోపించారు.

    కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైనా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలంటే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అనుమతులు తెచ్చుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుపోవాలన్నారు. కృష్ణా జలాలపై వివాదాలను ఆంధ్రప్రదేశ్ ఆపాలని అన్నారు. తెలంగాణలో వ్యాపారాలు అడ్డుకుంటున్నారని తెలంగాణలోని ఏపీ ప్రజలు ఏనాడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వారి ఆస్తులు, ఉద్యోగాలు, పరిశ్రమలకు తాము ఏమైనా ఇబ్బందులు పెట్టామా? అని ప్రశ్నించారు.

    Related Stories