శ్రీకాకుళంలో కోతులపై క్రూరత్వం.. 40కి పైగా మృత్యువాత

0
819

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలగాం గ్రామంలో కోతులు చనిపోయాయి. గ్రామానికి చెందిన వ్యక్తులు రహదారి వెంట వెళ్లగా.. ఓ తోట సమీపంలో కోతుల మృతదేహాలను గమనించారు. 40కి పైగా కోతులు చనిపోయి ఉన్నాయని తెలిపారు. వాటి పక్కనే మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో పడి ఉన్నాయి. కదలలేని స్థితిలో ఉన్న కొన్ని కోతులకు బిస్కెట్లు, నీళ్లు అందించే ప్రయత్నం చేసినా అవి తీసుకునే పరిస్థితిలో లేవు. కోతులపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోస్టుమార్టం నిర్వహించి.. జంతు చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కాశీబుగ అటవీ అధికారి మురళీకృష్ణ వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. ఇదిలా ఉండగా కోతులకు విషం ఇచ్చి చంపేశారని స్థానికులు ఆరోపించారు. “జిల్లాలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ చూడలేదు. ఎవరో ట్రాక్టర్‌లో కోతులను తీసుకొచ్చి గ్రామ అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనలో దాదాపు 40 నుంచి 45 కోతులు చనిపోయాయి” అని మురళీకృష్ణ చెప్పారు. చనిపోయిన 45 కోతులను రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమక్షంలో పూడ్చిపెట్టినట్లు సమాచారం. అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.