More

  మోదీపై విషం కక్కుతున్న ఆంధ్రజ్యోతి..!?
  – డా. పి. భాస్కరయోగి

  విషనాగులు పోషిస్తున్న పత్రికల్లో విషం తప్ప ఇంకేం ఉంటుంది..? మీకు నచ్చితే ఈగ నోట్లో కొంగను దాచేస్తారు. మీరు గిచ్చాలనుకుంటే చీమను కొండ శిఖరంపై కూర్చోబెడతారు. కమ్మని విషాన్ని అక్షరాల్లో గుదిగూర్చి ఆకాశంపై చిమ్మాలనుకోవడం ఆంధ్రజ్యోతికే చెల్లింది. రాధాకృష్ణగారూ..! మోదీపై ఆంధ్రజ్యోతి ఎందుకు కాలు దువ్వుతోంది..!?

  ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో జనసంఘ్, భాజపాలో పనిచేసిన దారపనేని కోటేశ్వరరావు అనే ఉన్నత విద్యావంతుడైన కమ్మ రైతు ఉండేవాడు. ఖమ్మం కమ్యూనిస్టుల కంచుకోట అయినా, ఏ పదవీ  లేకపోయినా ఆయన సిద్ధాంతం కోసం ఆజీవన పర్యంతం పనిచేశాడు. వాజ్ పాయ్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ బోర్డులో పదవి వస్తుందని ఆశించి ఢిల్లీ వెళ్లాడు. ఆ పదవిని తెలుగుదేశం వాళ్లు ఎగరేసుకుపోయారు. దానికి చంద్రబాబు చక్రం తిప్పాడని తెలిసి, ఆయన ఢిల్లీ నుండి ఖమ్మం వరకు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. చంద్రబాబు భారతీయ జనతాపార్టీని ఎలా ధ్వంసం చేశాడో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ. కానీ, ఇటీవల కమ్యూనిస్టులు ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రోజూ అదేపనిగా మోదీపై పలు విధాలుగా ‘క్యారెక్టర్ అసాసినేషన్’ చేసేందుకు తగిన ప్రయత్నం చేస్తున్నారు. సంపాదకులు కె.శ్రీనివాస్, రామచంద్ర గుహ, ఎ.కృష్ణారావు, రాజ్ దీప్ సర్దేశాయ్, భరత్ ఝన్ ఝన్ వాలా వంటివాళ్ల వ్యాసాలతో రోజూ మోదీని తిట్టేందుకు ప్రత్యేకంగా పని గట్టుకున్నారన్నది వాస్తవం.

  ఇక స్వేచ్ఛ, కులవాదం, అర్బన్ నక్సలిజం.. వంటి వాదాలతో మోదీని తిట్టే బ్యాచ్ ను పత్రికలో పెంచి పోషిస్తున్నారు. మరీ ముఖ్యంగా 2018లో టిడిపి భాజపాకు దూరం అయ్యాక ఈ పనిని నిరంతర యజ్ఞంలా నడిపిస్తున్నారు. అప్పుడు మానసిక శాస్త్ర విశ్లేషకుడి పేరుతో నరసింహారావు అనే వ్యక్తిని కూర్చోబెట్టి ‘మోదీకి తెలివి లేదు’ అంటూ నానా బూతులు తిట్టించారు. చలసానిశ్రీనివాస్ను ప్రత్యేక హోదా పేరుతో, శాస్త్రి అనే వ్యక్తిని ఆయనేదో ఢిల్లీ రాజకీయాన్ని ఔపోసన పట్టినట్లు ‘రూల్ ఆఫ్ లా’ చెప్పడం, కుటుంబరావు, పట్టాభి, బుద్ధా వెంకన్న.. వగైరా వాళ్లతో మోదీని, కేంద్రాన్ని తిట్టడమే పనిగా టీవి నడిపించారు. బాలకృష్ణ మోదీని ‘అమ్మనా బూతులు’ తిడితే, తిరుపతిలో అమిత్ షా పై రాళ్లు వేస్తే అదేదో టిడిపి వారి ఘనకార్యంగా చూపించారు.’దేశంలో స్వేచ్ఛ లేదు’ అంటూనే ఇంత స్వేచ్ఛగా, విశృంఖలంగా పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాయిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణేచంద్రబాబును ‘మోదీ నుండి దూరం కావద్దని చెప్పాను’ అని ఓ సందర్భంలో అనడం ప్రజలు ఇంకా మరచిపోలేదు.

  ఇక ఇటీవల ఆంధ్రజ్యోతిలో హద్దూ పద్దూ లేకుండా మోదీ వ్యతిరేక వ్యాసాలు రాయిస్తున్నారు. అడపా దడపా దత్తాత్రేయ, సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి వంటి వారి వ్యాసాలూ ప్రచురిస్తూ, సత్యకుమార్ ని మాత్రం రెగ్యులర్ గా మెయింటెన్ చేస్తున్నారు.దాని వెనుక మతలబు అందరికీ తెలుసు..!? ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ టీవీ ఇలా దుష్ప్రచారానికి దిగితే, ప్రజలు గమనించరని అనుకోవద్దు.2019 ఎన్నికల్లో ఈ ఓవర్ యాక్షనే చంద్రబాబు కొంప ముంచింది. అయినప్పటికీ పాఠాలు నేర్వకుండా ఆ దుష్ప్రచారాన్ని మళ్లీ కొనసాగిస్తున్నారు. ఇటీవల సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడయ్యాక దానికి మరింత పదును పెట్టి ఇటీవల విష్ణువర్ధన్ రెడ్డిని శ్రీనివాస్ రావుతో ‘చెప్పుతో’ కొట్టించి కక్ష తీర్చుకున్నారు.ఇటీవల దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆంధ్రజ్యోతి తెలంగాణ భాజపాను భుజాల మీద ఎత్తుకుని తిరిగి, ఎమ్ఎల్ సి ఎన్నికల నుండి మళ్లీ పాత రాగం అందుకుంది.

  ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందు నుండి అనేక అంశాల్లోకి వెళ్లి అసత్యాలను, అర్ధ సత్యాలను రాస్తూ మోదీని టార్గెట్ గా చేసుకుని, ఆయనపై అక్షర విషం చిమ్ముతున్నారు. నిజానికి జర్నలిజం లోతుపాతులు ఇక్కడి భాజపా శ్రేణులకు అర్థం కాలేదు కాబట్టి ఎబిఎన్ పై జగన్ మోహన్ రెడ్డి కేసు పెడితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీకు సంఘీభావం తెలుపుతాడు. దీనిపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాధాకృష్ణను బాగా అర్థం చేసుకున్నవాళ్లలో ప్రథముడు వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు కేసిఆర్. ‘ఎవరికీ తల వంచం’ అనే రాధాకృష్ణ గారూ కేసిఆర్ ను చీల్చి చెండాడి చూడండి.. స్వేచ్ఛకున్న పరిమితులేంటో ఆయన మీకు పాఠాలు నేర్పిస్తాడు. మరోపక్క భాజపాలోని సద్గుణ సంపద ఇప్పుడు వికృతిగా మారి తమ పార్టీకి చెందిన వ్యక్తిని, లేదా ఈ దేశ ప్రధానిని రోజూ దూషణ చేస్తున్నా పరమ సాత్వికుల్లా చూస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఎవరి బలం చూసుకునో గానీ మీకు పట్టపగ్గాలు లేకుండా పోయాయని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇపుడు భాజపాపై కాలు దువ్వుతున్నారో..? ఇరిటేట్ చేస్తున్నారో..? అర్థం కావట్లేదు.

  వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు నిద్ర లేని రాత్రులు ప్రారంభం అయ్యాయి. మోదీ, షాల ఆశీర్వాదంతోనే జగన్ ఇదంతా చేస్తున్నాడని వీళ్లు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇది అందరికీ తెలుసు. దేశంలో రాజకీయ అవసరాలు అన్ని సిద్ధాంతాల కన్నా బలీయమైనవి. వాళ్ల మధ్య ఏం జరుగుతుందో వాళ్లే చెప్పాలి. కానీ చంద్రబాబు తనంత తానుగా ఎన్డీఏలో నుంచి బయటకొచ్చి అకారణ యుద్ధం మొదలు పెట్టాడు. దానికి ఈ వందిమాగధులు బాకాలూదారు. నిజానికి ఇప్పటికీ చంద్రబాబు చెప్పినట్లు విని చక్రాన్ని తిప్పేవాళ్లు భాజపాలో నలభై శాతం ఉన్నారు. అందుకే సోము వీర్రాజు కాళ్లకు బంధం పడుతోంది. కంభంపాటి హరిబాబు, కామినేని శ్రీనివాస్ వంటి వారిలో భాజపాకన్నా టిడిపి రక్తమే ఎక్కువగా ప్రవహిస్తోందని చెప్తారు. వీళ్లందరికి ఓ పెద్ద మనిషి (?) ఆశీర్వచనం ఉండనే ఉంది. ఆ అదృశ్య శక్తే తెలుగు రాష్ట్రాల్లో భాజపా దీన హీనస్థితికి కారణం. ఇప్పటివరకు భాజపాతో కలిసినప్పుడు మాత్రమే చంద్రబాబు అధికారంలోకి వచ్చినమాట నిష్ఠుర సత్యం. 1999, 2014 ఎన్నికలలో భాజపాతో కలిసినప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నది అందరికీ తెలుసు. కానీ 2018 మధ్య నుండి ‘గాయి గాయి’ చేసి లేని శత్రువును బూచిగా చూపి అధికారంలోకి వద్దామంటే పాచిక పారలేదు. దానికి బాబు స్వయంకృతాపరాధం సగం కారణం. అయితే మీరు మోదీపై చేసిన దుష్ప్రచారం మరో సగభాగం కారణం అయ్యిందని మీ అంతరాత్మకు తెలుసు. ఇప్పుడు తెలుగుదేశం మహానాడులో ‘భాజపాతో పొత్తుకు సై’ అన్నట్లు తీర్మానం పెట్టడం చంద్రబాబు అవకాశవాదానికి పరాకాష్ఠ.

  ఇప్పుడు ఆంధ్రజ్యోతి కాలు దువ్వుతున్నందుకు బహుశా రెండే కారణాలు. ఒకటి భాజపాను భయపెట్టి చంద్రబాబుతో దోస్తీ చేయించడం, రెండవది మోదీపై ఏహ్యభావం పుట్టించడం. ఈ రెండు కుట్రలు పత్రికలు చేయడం ఎంతవరకు సమంజసం..? ఏ ప్రభుత్వం ఎంతగా కక్ష గట్టినప్పటికీ పత్రికలు మూడు పూవులు, ఆరు కాయలుగా శోభిస్తూనే ఉంటాయని నార్ల వెంకటేశ్వరరావు 11 జూలై 1968 నాటి తన సంపాదకీయంలో రాశారు. కానీ ఆంధ్రజ్యోతి మోదీ ప్రభుత్వంపై కక్ష గట్టి చరిత్రను తిరగేసుకొస్తున్నారు. 2019లో మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చి కశ్మీర్ లో 370 ఆర్టికల్, 35ఎ రద్దు చేస్తే చంద్రబాబు అర్నెల్లలోనే శత్రుత్వం మరిచిపోయి మద్దతు పలికాడు. పవన్ కళ్యాణ్ ను భాజపా గేటు దగ్గర కాపలా పెట్టింది ఎవరో త్వరలోనే ప్రజలు గ్రహిస్తారు. సుజనా చౌదరి, సిఎం రమేశ్, టిజి వెంకటేశ్ లు భాజపాలోకి ఎందుకు వచ్చారో ఇప్పటివరకూ భాజపా నాయకత్వం గ్రహించలేదు. ఇదంతా తేలకపోయేసరికి మీ ద్వారా క్రొత్త కుట్రకు తెరలేపి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్నది. గండరగండడు అమిత్ షా, మోదీల దగ్గర వాజ్ పాయ్ కాలంలా చక్రాలు తిప్పుతామంటే ఉన్న బేరింగులు ఊడిపోతాయి అన్న విషయాన్ని ఉత్తరాదిలో ఎన్నో అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి.

  రాజకీయాల్లో ఇదంతా మామూలే. కానీ ఒక పత్రికగా ప్రజలకు మంచి విషయాలు చెప్పడం, సద్విమర్శ చేయడం మాని, ఇలాంటి చౌకబారు విధానాలకు దిగడం దారుణం. 2018లో ఎలా అభూత కల్పనలు సృష్టించారో ఇప్పుడూ అదే పనిలో ఆంధ్రజ్యోతి ఉండటం మరీ దారుణం. 2019 ఎన్నికలకు ముందు మోదీపై విశ్వాసం సన్నగిల్లిందని రాశారు. అలాగే నితిన్ గడ్కరీ పేరును మీరే తెరపైకి తెచ్చారు. ఢిల్లీలోని ప్రసిద్ధ మీడియాకు అందని ఉప్పు మీకెలా అందుతుందో అర్థం కాదు. అంతెందుకు..! ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కరోనా విషయంలో సందేశం ఇస్తూ ‘వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ విపత్తు తీవ్రత పెరిగింద’ని చెపితే, ‘ప్రభుత్వం, మోదీ సరిగ్గా పనిచెయ్యలేదని ఆరెస్సెస్ అనుకుంటోంది’ అంటూ ఏకంగా వార్తె రాసేశారు. ఢిల్లీలోని ఓ ఆస్థాన విద్వాంసుడు, అపరిపక్వ వ్యాసకర్త దీనిపై వ్యాసం రాయడం విడ్డూరం. ‘ఆరెస్సెస్ సరసంఘచాలక్ మాట్లాడిన మాటలను అనువదించడంలో దొర్లిన పొరపాటు ఇది’ అనుకోవడం అమాయకత్వం.

  ఉద్దేశపూర్వకంగా జ్యోతి పత్రిక మోదీ పొరపాటును సంఘ్ తీవ్రంగా పరిగణిస్తోందని, ప్రధాని మార్పు జరగొచ్చన్నట్లుగా రాయడం వంచన కాదా..? అసలు ఎప్పుడైనా ‘సంఘ్’ కార్యాలయానికి వెళ్లారా..? ప్రభుత్వ ప్రతి విషయంలోనూ ఆరెస్సెస్ జోక్యం చేసుకోదు అన్న విషయం ‘పరివార సంస్థ’ లలో పనిచేస్తే గానీ అర్థం కాదు. అక్కడా ఎన్నో హద్దులుంటాయని మరవద్దు. మోదీపై ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామందికి ద్వేషం ఉంది. పాలస్తీనా రోడ్లపై పడి ఇజ్రాయెల్ ని తిట్టేవాడు మొదలుకొని, ఈ దేశంలోని మమత, కేజ్రీవాల్, మాయావతి, పవార్, ఠాక్రే, దేవెగౌడ, స్టాలిన్, సోనియా, ఫరూక్ వరకు ఎందరో మోదీని విమర్శిస్తారు. అలాగే సిద్ధాంత పరంగా వామపక్షాలు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, సూడో మేధోవర్గం.. ఇలా ఎందరో..! కానీ, ఆంధ్రజ్యోతి మాత్రం కేవలం చంద్రబాబును గొప్పస్థానంలో చూడడం కోసం మోదీని విమర్శిస్తోంది. వెంకయ్య మంత్రిగా ఉన్నంతవరకు మోదీని ‘ప్రపంచ నేత’ అన్న బాబే 2018 ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత ఆయనపై వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నాడు. దానికి ఫ్రేం కట్టేందుకు ఓ పత్రిక రామచంద్ర గుహ చరిత్రను, రాజ్ దీప్ రాజకీయ విశ్లేషణను, దక్షిణాది-ఉత్తరాదిని, ప్రత్యేక హెూదాను వాడుకున్నారు. ‘టీకాలు మనం తయారుచేస్తే లాభాలు కార్పొరేట్ వాళ్లకా..!’ అనీ, ‘చౌకీదారు సమాంతర వ్యవస్థగా మారాడు’ అనీ హెడ్డింగులు పెట్టారు. సిబిఐ, న్యాయస్థానాల రోజువారి కార్యకలాపాలు మొదలుకొని ఆఖరుకు గుజరాత్ లో ఎవరో అనామకులు రాసిన ‘నగ్న ఫకీరు’ కవిత వరకు అన్నిటినీ మోదీని తిట్టేందుకు ఉపయోగించుకున్నారు.

  “మీ రామరాజ్యంలో గంగానదిలో మృతదేహాలమై ప్రవహిస్తున్నాము. అయ్యా మీవి దివ్యమైన వస్త్రాలు, మీ ప్రతిష్ఠ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మీరు వజ్రం కాదు, బండరాయి అన్న సత్యాన్ని జనం ఎప్పుడు తెలుసుకొంటారో..? ఎవరికైనా ధైర్యం ఉందా.. అయ్యగారు నగ్నంగా ఊరేగుతున్నారు అని చెప్పడానికి..!?” (ఆంధ్రజ్యోతి – 31 మే, 2021) అంటూ వ్యక్తిగత ద్వేషం విరచిమ్మడంలో హద్దులు దాటుతున్నారు. జగన్ పై చంద్రబాబుకున్న ఆగర్భ శత్రుత్వాన్ని ఒక పత్రికగా ఇంతలా భుజాలపై మోసుకుని తిరగడం సమంజసమేనా..? వీళ్ల విచిత్రమైన విశ్లేషణలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. 2018లో గుజరాత్ ఫలితాల్లో భాజపా గెలిస్తే ‘2012లో 115 సీట్లు గెలుపొందిన భాజపా ఇప్పుడు 16 సీట్లు కోల్పోయింది, మిషన్ 150-అమిత్ షా ప్లాన్ అట్టర్ ఫ్లాప్’ అంటూ వ్యాఖ్యానాలు చేయించడం సరైన జర్నలిజమా..? గుజరాత్ లోని పోర్బందర్ లో భాజపా అభ్యర్థి బాబూ భాయ్ బొఖారియా 1855 ఓట్లతో గెలిస్తే, ఆ నియోజకవర్గంలో ‘నోటాకు 3,483 ఓట్లు పోలయ్యాయి. కాబట్టి మెజారిటీ నోటాకే’ అని హెడ్డింగులు పెట్టారు. ఇది ఎటువంటి విశ్లేషణో వాళ్లకే తెలియాలి.

  ఇవి కొన్న మచ్చుతునకలే. రోజూ చేస్తున్న విషమాక్షర సమరం గురించి రాస్తే ఓ గ్రంథమే అవుతుంది. ‘పత్రికలు-మేధోవర్గం’ అన్న అంశంపై నిజానికి తెలుగునాట ఆంధ్రజ్యోతికే పట్టింపు ఎక్కువ. ఎందుకంటే మిగతా పత్రికలన్నీ దాదాపుగా పార్టీలకు సంబంధించినవే. అటువంటి నిఖార్సయిన ఆంధ్రజ్యోతి నిఖార్సయిన జర్నలిజం వదలి పెట్టి ఇటువంటి చౌకబారు వాదనకు దిగడం దారుణం. ఫేస్ బుక్, వాట్సాప్ కామెంట్లను ఒక్కసారి తరచి చూస్తే రాధాకృష్ణకు తెలుస్తుంది. “ఔచిత్యం పాటించకుండా ఏదో ఒక అంశానికి లీడ్ ఇవ్వాలన్న ఆత్రుత ప్రజల మధ్య సంఘర్షణ, విభేదాలు పెంచేదిగా ఉండకూడదు” అన్న సీనియర్ పాత్రికేయులు జియస్ వరదాచారి మాటలను గుర్తుచేసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. దాన్ని పత్రిక నిలబెట్టుకుంటుందని పాఠకులు ఆశిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి మీద ద్వేషం వెళ్లగక్కడం కోసం లేదా తమ దారికి తెచ్చుకోవడం కోసం చేసే ‘కుటిల అక్షర యజ్ఞం’ స్వీయ మారణ ప్రయోగమే తప్ప మరొకటి కాదని త్వరలోనే గ్రహిస్తారు.

  – ఇటీవల మోదీపై ఆంధ్రజ్యోతి చేస్తున్న అకారణ యుద్ధం చూసి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి. భాస్కరయోగి రాసిన వ్యాసం.

  spot_img

  Trending Stories

  Related Stories