ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన బీజేపీ.. లేకుంటే కూల్చేస్తాం

0
961

గుంటూరులోని జిన్నా టవర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో బీజేపీ కీలక నేతలు, సునీల్‌ దియోధర్‌, సత్యకుమార్‌ పాల్గొన్నారు. వీరిని అడ్డుకున్న పోలీసులు.. వారిని స్టేషన్ కు తరలించారు. పోలీసులు అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించిన నినాదాలు చేశారు బీజేవైఎం కార్యకర్తలు. జిన్నా టవర్‌ మార్చి, అబ్దుల్‌కలాం పేరు పెట్టాలని నినాదాలు చేశారు. పేరు మార్చకపోతే ఆగస్టు15కి జిన్నాటవర్‌ కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. జిన్నా టవర్‌ సెంటర్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని గత కొన్ని నెలలుగా బీజేపీ, ఇతర హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. “జిన్నా టవర్ పేరును డా..ఏపీజే అబ్దుల్ కలాం టవర్ గా మార్చాలనే భారతీయ జనతా పార్టీ డిమాండ్ కు ప్రజల నుండి కూడా మద్దతు లభిస్తుంది.ఒక దేశ ద్రోహి పేరును తుడిచి వేయాలనే మా అభ్యర్ధనపై రాష్ట్ర ప్రభుత్వ అనిచివేత వైఖరి తగదు. పోలీసు బలగాల ద్వారా మా సంకల్పాన్ని నిలువరించలేరు.@ysjagan గారు.” అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. తమ పార్టీ నేతలను పోలీసులు నిర్బంధించడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ‘మనం ఏపీలో ఉన్నామా, పాకిస్థాన్‌లో ఉన్నామా’ అని ట్వీట్‌ చేశారు.