Kshaatram

భారతీయ క్షాత్రధర్మం – యుద్ధనీతి

యుద్ధం.. ఈ పదం లేకుండా ప్రపంచ చరిత్రను చదవడం అసాధ్యం. యుద్ధం ప్రపంచ గతిని మార్చేస్తుంది. విశ్వమానవాళిని ప్రభావితం చేస్తుంది. కొన్ని యుద్ధాలు పేదరికాన్ని, ఆకలి చావులను మిగిల్చితే.. అవే యుద్ధాలు కొన్ని దేశాల్లో అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఒకప్పుడు రాజ్యాల కోసం మాత్రమే యుద్ధాలు జరిగేవి. కానీ, కాలానుగుణంగా యుద్ధం ఎన్నో రకాలుగా రూపాంతరం చెందింది. యుద్ధరీతి, యుద్ధ నియమం, యుద్ధ వ్యూహం.. ఇలా ప్రతి విషయంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కాలగమనంలో యుద్ధానికి స్వార్థం కూడా జతకలిసింది. దాంతో యుద్ధం అర్థమే పారిపోయింది. అటు, మందుగుండు రాకతో యుద్ధ స్వరూపం కూడా మారిపోయింది.

నేటి ఆధునిక ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల్లో ధర్మ యుద్ధాల కంటే, అధర్మ యుద్ధాల పాలే ఎక్కువ. దురహంకార పూరిత జాతీయవాదం, సామ్రాజ్యవాదం, సైనికవాదం వంటి అంశాలు మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇక, నియంతృత్వం, సామ్యవాదం వంటివి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. ప్రస్తుత కాలంలో మతోన్మాదం, విస్తరణవాదం, ఆధిపత్య ధోరణి వంటి అంశాలు యుద్ధాలను ప్రేరేపిస్తున్నాయి. మరోవైపు యుద్ధ కారణాలు మారినట్టే.. యుద్ధ రీతులు, అస్త్ర శస్త్రాల్లోనూ మార్పులొచ్చాయి. కత్తులు, బరిసెలు, విల్లంబుల స్థానాన్ని.. అణ్వస్త్రాలు, రసాయనిక, జీవాయుధాలు ఆక్రమించాయి. అణ్వాయుధాలు వచ్చిన తర్వాత జరిగిన రెండో ప్రపంచ యుద్ధం.. జపాన్ కు ఎంతటి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందో చూశాం. హిరోషిమా, నాగాసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించడంతో.. అపార జన నష్టం సంభవించింది. మొన్నటికి మొన్న సిరియాపై రసాయనిక దాడులను కూడా చూశాం. ఇప్పుడు కరోనా వంటి జీవాయుధాలను చూస్తున్నాం. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న దుర్బుద్ధితో.. చైనా అధర్మ యుద్ధనీతి నుంచి ఉద్భవించిన జీవాయుధమే కరోనా.

అసలు ధర్మ యుద్ధం అంటే ఏమిటి..? ధర్మ యుద్ధం యొక్క స్వరూపం ఎలావుంటుంది..? యుద్ధం గురించి మన వేదాలు, పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి..? యుద్ధం అనివార్యమైనప్పుడు పర్యవసానాలకు బెదరకుండా.. అన్నింటికీ సిద్ధపడి శత్రుసంహారం చేయడమే క్షాత్రధర్మం. అలాంటి క్షాత్రధర్మాలను అనుసరించి జరిగేదే ధర్మ యుద్ధం. కేవలం శౌర్య పరాక్రమాలే కాదు,.. నీతి, నియమాలు కూడా ధర్మ యుద్ధానికి మూలసూత్రాలు. రామాయణ, మహాభారత యుద్ధాల్లో మనకు ఇవన్నీ కనిపిస్తాయి. త్రేతాయుగం, ద్వాపర యుగంలో జరిగిన యుద్ధాలన్నీ ధర్మయుద్ధాలే. అలాగే, కలియుగంలో ప్రాచీన భారతీయ రాజులు ధర్మ యుద్ధరీతులనే అనుసరించారు.

పూర్వకాలంలో రాజుల వద్ద చతురంగ బలాలు ఉండేవి. చతురంగ బలాలంటే రథ, గజ, తురగ, కాల్బలాలు. అలాగే వాయుసేన, నౌకసేన, పదాతి సైన్యంతో.. త్రివిధ దళాలు కూడా ఉండేవి. ఇలా పూర్వకాలంలోనే మనకు నింగి, నేలా, నీటిలోనూ యుద్దాలు చేసే సైన్యాలు ఉండేవి. అటు యుద్ధ సమయంలో రాజ్యంలోని ప్రజలకు ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ప్రాచీన భారతీయ రాజుల దృష్టిలో యుద్దం అంటే రాజ్యాల మధ్య గెలుపు – ఓటముల క్రీడ మాత్రమే. క్రీ.పూ.4వ శతాబ్దంలో భారత దేశంలో పర్యటించిన మెగస్తనీస్ అనే గ్రీకు చరిత్రకారుడు.. మన దేశంలో రాజుల మధ్య జరిగే ధర్మబద్ధమైన యుద్ధాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓవైపు మైదానంలో యుద్ధం జరుగుతూ ఉంటే.. మరోవైపు పక్కనే పంట పొలాల్లో అన్నదాతలు తమ పనుల్లో నిమగ్నమయ్యేవారు. పౌరుల దృష్టిలో యుద్ధం అంటే అది ఒక అధికార మార్పిడి మాత్రమే..! రాజ్యంలోని రైతులు.., పౌరులకు ఏ ఇబ్బందీ ఉండేది కాదు. యుద్ధ సమయంలో దోపిడీ దహనాలు, సామాన్య ప్రజల ఊచకోతలు అంటే ఏమిటో భారతీయులకు తెలియదు..! అదే సమయంలో ఇతర దేశాల్లో యుద్దం జరుగుతున్న సమయంలో అనేక దోపిడీలు.. అక్రమాలు జరిగేవి. పౌరులపై దాడులు జరిగేవి. ప్రజలను ఊచకోత కోసేవారు. ఆ యుద్ధాలన్నీ అధర్మ యుద్ధాలే.

కానీ, ప్రాచీన భారతీయులు చేసిన యుద్ధాలన్నీ క్షాత్రధర్మాన్ని అనుసరించి ధర్మ బద్ధంగా జరిగేవి. యుద్ధ నియమాలు, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేవారు. క్షాత్రధర్మానికి సంబంధించి నీతి, నియమాలు వేదకాలంలోనే నిర్వచించబడినాయి. వేద శాస్త్రాల్లో యుద్ధరీతులు, యుద్ధ ధర్మాలు విశదీకరించబడి వున్నాయి. యజర్వేదానికి ఉపవేదమైన ధనుర్వేదం.. క్షాత్రధర్మాన్ని బోధిస్తుంది. ధనుర్వేదాన్ని సంపూర్ణ వార్ మేనేజ్ మెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సైనిక నిర్మాణం, నిర్వహణ, ఆయుధ సంపత్తి, యుద్ధ వ్యూహాలు.. ఇలా వార్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన ప్రతి అంశం ధనుర్వేదం వివరిస్తుంది.

అనివార్యం అనుకున్నప్పుడు మాత్రమే శత్రువుతో ప్రత్యక్ష యుద్ధం చేయాలని ధనుర్వేదం చెబుతోంది. దౌత్య మార్గంలో ముందు వివాద పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచిస్తోంది. ధనుర్వేదం.. ఈ ప్రక్రియ నాలుగు స్థాయిల్లో వివరించింది. అవి సామ, దాన, భేద, దండోపాయాలు. వీటి గురించి మనం తరుచూ వింటూవుంటాం. మొదటి ప్రయత్నంలో భాగంగా.. పరిస్థితులు యుద్ధానికి దారితీయకుండా.. ముందే శత్రువుతో చర్చలు జరిపి పరిష్కరించుకోవడం. ఇక రెండో విధానంలో యుక్తితో శత్రువును మిత్రుడిగా మార్చుకోవడమే దానోపాయం. అయినప్పటికీ శత్రువు దారిలోకి రాకపోతే.. మూడో ప్రయత్నంగా వైరి వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసి దారికి తెచ్చుకోవాల్సి వుంటుంది. దీనినే భేదోపాయం. అప్పటికీ వివాదం పరిష్కారం కాకపోతే.. చివరి ప్రయత్నంగా యుద్ధానికి దిగడం. అదే దండోపాయం అంటారు. అంతేకాదు, యుద్ధ భూమిలో దండనీతి ఎలా అమలు చేయాలో కూడా ధనుర్వేదంలో సవివరంగా వివరించబడివుంది.

ధనుర్వేదాన్ని తొలిసారి సాక్షాత్తు పరమశివుడే ప్రబోధించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత శ్రీరామచంద్రుడి గురువైన వశిష్ట మహర్షి.. వశిష్ట ధనుర్వేద సంహింతను రచించారు. వశిష్ట ధనుర్వేద సంహితతో పాటు.. వేదవ్యాసుడు రచించిన అగ్ని పురాణం, మహాభారతం, అలాగే వాల్మీకి రచించిన రామాయణ గాథలు ధనుర్వేదాన్ని వివరిస్తాయి. అంతేకాదు, మన ప్రాచీన రుషులు ధనుర్వేదం.. ధునుర్విద్యకు సంబంధించిన ఇంకా ఎన్నో గ్రంథాలు రాశారు. ఇస్లామిక్ దురాక్రమణదారుల మూలంగా.. వీటిలో చాలా గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి. 80, 90వ దశకంలో దురదర్శన్ లో రామాయణం…, మహాభారతం టీవీ సీరియల్ ప్రసారాల మూలంగా.. దేశంలో చాలా మందికి తమ గతవైభవం గుర్తుకు వచ్చింది. అంతేకాదు ఆనాడు ప్రాచీన భారతీయులు వాడిన ఆయుధాలు.. వాటి పేర్లు, అస్త్రశస్త్రాలను తలచుకుని ఉప్పొంగిపోయారు..! మనం.. మన గతవైభవ చరిత్రను పూర్తిగా మార్చిపోయాం..! కాదు మనల్ని మార్చిపోయేలా చేశారు మార్క్స్ మెకాలే వాద చరిత్రకారులు.!

యుక్తి కల్పతరువు అనే గ్రంతంలో భోజరాజు.. రెండు రకాలైన ఆయుధాల గురించి వివరించాడు. అవి మైకం.., నిర్మయం…! ఇటు కౌటిల్యుడు కూడా ఆయుధాలను పలు రకాలుగా విభజన చేశాడు. ఆ రోజుల్లో యుద్ధ రంగాలలో పలు ఆయుధాలు ఉపయోగించేవారు. వాటిలో కొన్ని దాడి చేయటానికి మాత్రమే వాడేవారు. ధనుస్సు, ఖడ్గం, బల్లెం, గద, చక్రం, శూలం, దండం వంటివి ఉపయోగించేవారు..! అలాగే ఆత్మ రక్షణ కోసం.. శిరస్త్రాణం, కవచం, కంఠ కవచం.., కంచుకం వంటి వాటిని యోధులు ధరించేవారు..!

అంతేకాదు ఆనాటి కాలంలోనే యుద్ధంలో అనేక రకాల యంత్రాలను ఉపయోగించేవారు. విమానంలో ఉపయోగించే యంత్రాలు.., రాళ్లు విసిరే యంత్రాలు.., శబ్దాలు చేసే యంత్రాలు.., అగ్ని వర్షం కురిపించే యంత్రాలు ఉండేవని…ఆనాటి రచనలపై పరిశోధనలు చేసిన చరిత్రకారులు చెబుతారు.

యుద్ధంలో ఉపయోగించే.. యంత్రాలకు సంబంధించిన వివరాలు.. మనకు భోజరాజు రచించిన సమరాంగణ సూత్రధార లో కనిపిస్తాయి. ఇంకా భరద్వాజ మహర్షి రచించిన యంత్ర సర్వస్వం…, కౌటిల్యుని అర్థశాస్ర్తం.., శుక్రనీతి అనే మరొక అర్థశాస్త్రం.., అగస్త్యుని శక్తి సూత్రాలు… శివుడు రచించిన సౌదామినికళ వంటి గ్రంథాలలో మనకు ఈ యంత్రాల గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి.

కౌటిల్యుడు.. పలు రకాల అగ్నిబాణాలు గురించి వివరించడమే కాదు…వాటి తయరీ విధానం కూడా తెలిపాడు. అగ్ని బాణాలలో అగ్నిధారణ, విశ్వాస ఘటి అనే అగ్ని తయారీ మందు గురించి కూడా కౌటిల్యుడు చెప్పాడు.

ఇంకా శుక్రనీతి అనే గ్రంథంలో అగ్నిబాణాలు…, ఫిరంగి మందు…., తయారీ గురించిన వివరాలు అనేకం ఉన్నాయి. కోటల బురుజులలో శతఘ్నులను సైతం నిలిపే విధానాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి.

ఇక ప్రాచీన భారతీయ గ్రంథాలలో తూపాకీ ప్రస్తావనలు ఉన్నాయాంటే ఈనాటి తరం భారతీయులు నమ్మేనే నమ్మరు కానీ…! ఇది నిజం… మన శుక్రనీతి గ్రంథంలో తుపాలకు ప్రస్తావన ఉందని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఈ తుపాకులను మన ప్రాచీన భారతీయులు… నాళిక అని పిలిచేవారని…, దీనికి సంబంధించిన చక్కని వివరణలు కూడా ఉన్నాయని చెబుతారు. పెద్ద నాళికలు, చిన్న చిన్న నాళికలు అని రెండు రకాల తుపాకులకు సంబంధించిన వివరాలను శుక్రనీతిలో వివరించారు మన రుషులు..! ప్రాచీన భారతీయ యుద్ధశాస్త్రం…ఆయుధాలు, ధనుర్విద్యపై ఇంకా సమగ్ర పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ విషయాలను మరింత విపులంగా మన భావితరాలకు బోధించాలి. ఆ దిశగా మన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − five =

Back to top button