National

ఆర్యన్ ఖాన్ తో ఆ విషయంలో జోక్ చేశాను: అనన్య పాండే

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్యా పాండే వరుసగా రెండో రోజు ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. గురువారం షారుక్‌ నివాసం ‘మన్నత్‌’లో సోదాలు నిర్వహించారు. అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్‌ ఫోన్‌, ల్యాప్ టాప్ ను సీజ్‌ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం ఆమెను సుదీర్ఘంగా విచారణ చేయగా.. శుక్రవారం కూడా విచారణకు రావాలని పిలిచారు.

శుక్రవారం నాడు ఆమెను ఎన్సీబీ అధికారులు సుమారు 4 గంటల పాటు ప్రశ్నించారు. అనన్య- ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ అందించినట్టు గతంలో ఓ వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడైందని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. తాను ఎవరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని అనన్య పేర్కొంది. గంజాయి గురించి అడిగిన ఆర్యన్ తో కేవలం తాను జోక్ చేశానని, అంతే తప్ప డ్రగ్స్ గురించి తనకేమీ తెలియదని అధికారులకు స్పష్టం చేసింది. గంజాయి కోసం ఆర్యన్‌ అడగ్గా.. ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్‌ లో ఉందని.. ఈ చాట్‌ను చూపించి అధికారులు ప్రశ్నించగా.. తాను కేవలం జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు మీడియాలో వచ్చాయి. తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, ఎవరికీ సరఫరా చేయలేదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయితే ఆర్యన్‌ కోసం అనన్య డ్రగ్స్‌ పంపించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని తెలుస్తోంది. ఆమె నుంచి ఇంకా సమాచారం సేకరించాలని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు సోమవారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు.

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను పోలీసులు డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆర్యన్ వాట్సాప్ డేటా పరిశీలించగా, అనన్య పాండేతో చాటింగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెకు పోలీసులు సమన్లు జారీ చేశారు. పలువురు స్టార్ కిడ్స్ కు కూడా ఇందులో లింక్స్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తూ ఉన్నారు.

Related Articles

Back to top button