విద్యార్థులపై పోలీసుల దాడి.. నేడు బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు నేడు అనంతపురం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ని పలువురు నేతలు ఖండించారు. అనంతపురంలో ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఎస్ఎస్బీఎన్ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చదువులను వ్యాపారం చేస్తోందని ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. లాఠీఛార్జ్ అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని ఖండిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు.
ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ల విలీనం వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్ఎస్బీఎన్ కాలేజీ దగ్గర విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎప్ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఎస్ఎస్బీఎన్ కాలేజీ, స్కూల్ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.