అనంతపురం జిల్లా కియా పరిశ్రమలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం చివరికి ఇనుప రాడ్లతో పరస్పరం తీవ్ర దాడులకు పాల్పడేలా మారింది. జూనియర్లు, సీనియర్లు అంటూ ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ దాడి ఘటనను కంపెనీలోని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు.
జూనియర్లు.. సీనియర్లు మధ్య ఎంతోకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కియా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోవట్లేదు. కొందరు ఉద్యోగుల మధ్య గొడవలపై మిగిలిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో స్వల్ప వివాదాలు చోటు చేసుకోగా ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులతో కియాలో పని చేస్తున్న మిగతా ఉద్యోగులు భయపడుతూ ఉన్నారు. కంపెనీ నిర్వాహకులు ఈ ఘర్షణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కియా పరిశ్రమలో గతంలో ఓ కన్సెల్టెన్సీ ద్వారా కొందరు ఉద్యోగులు సంస్థలో చేరగా.. కొంతకాలంగా వేరే కన్సెల్టెన్సీ ద్వారా పరిశ్రమలో ఉద్యోగులు చేరుతున్నారు. గతంలో కన్సెల్టెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరినవారికి కొత్తవారికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రధాన ప్లాంట్‌లో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నా పోలీసుల వరకూ పెద్దగా ఈ గొడవలు వెళ్ళలేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే గొడవలు తారా స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.