వివరణ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ.. వెంటనే అరెస్టు చేయాలని నారా లోకేశ్‌ డిమాండ్

0
900

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అనంత ఉదయ్ బాబు మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం గత ఐదేళ్లుగా తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడని చెప్పారు. రెండు నెలల నుంచి సరిగా పనికి రావడం లేదని తెలిపారు. సుబ్రహ్మణ్యంకు మద్యం అలవాటు ఉందని, ద్విచక్ర వాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురయ్యాడని చెప్పారు. రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ కు గురైనట్టు తెలిసిందని, దీంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. చికిత్స కోసం అతడిని కాకినాడలోని అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆసుపత్రి వద్దకు అతని తల్లిదండ్రులు కూడా వచ్చారని చెప్పారు. ఆసుపత్రిలో సుబ్రహ్మణ్యం చనిపోవడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తామని చెప్పడంతో భౌతికకాయాన్ని కారులో అపార్ట్ మెంట్ వద్దకు పంపించామని తెలిపారు.

ఎమ్మెల్సీ అనంత బాబుని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన ట్విటర్‌లో కోరారు. సుబ్రహ్మణ్యంను రాత్రి కారులో తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కారణం చెప్పకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు, భార్యకు అప్పగించి వెళ్లడం అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. హత్యను ప్రమాద ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఏపీ బీహార్‌ కంటే దారుణంగా మారిందని ఆరోపించారు.